Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో టీడీపీ- కాంగ్రెస్ పొత్తు లెక్క ఇదేన‌ట‌!

By:  Tupaki Desk   |   6 Sep 2018 5:00 AM GMT
తెలంగాణ‌లో టీడీపీ- కాంగ్రెస్ పొత్తు లెక్క ఇదేన‌ట‌!
X
ముంద‌స్తు ప‌క్కా అన్న నేప‌థ్యంలో రాజ‌కీయ వ్యూహాలు ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా మారిపోతున్నాయి. కేంద్రంలో మోడీ స‌ర్కారుకు మ‌ళ్లీ అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లే.. తెలంగాణ‌లోనూ కేసీఆర్ స‌ర్కారుకు ఎట్టి ప‌రిస్థితుల్లో అవ‌కాశం ఇవ్వ‌ని రీతిలో వ్య‌వ‌హ‌రించాల‌న్న ప‌ట్టుద‌ల తెలంగాణ కాంగ్రెస్‌ లో క‌నిపిస్తోంది.

ఈసారికి కేసీఆర్ అధికారంలోకి వ‌స్తే.. త‌మ రాజ‌కీయ జీవితం స‌మాప్తి అవుతుంద‌న్న భావ‌న‌లో ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం సైతం చాలా సీరియ‌స్ గా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పాటు.. తూర్పున ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న రాష్ట్రం ఒక్క తెలంగాణ (క‌ర్ణాట‌క‌ను మినహాయిస్తే) త‌ప్ప వేరే దారే లేద‌ని.. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో అధికారాన్ని చేజిక్కించుకోవ‌టానికి దేనికైనా సిద్ధమ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో టీఆర్ ఎస్ ను ఒంట‌రిగా ఎదుర్కొనే స‌త్తా కాంగ్రెస్ కు లేద‌న్న విష‌యంపై స్థానిక నేత‌లు మొద‌లు అధినాయ‌క‌త్వం వ‌ర‌కూ అంద‌రికి క్లారిటీ ఉంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో అధికారాన్ని సొంతం చేసుకోవ‌టానికి వీలుగా పొత్తులు మిన‌హా మ‌రో దారి లేద‌న్న భావ‌న‌లో కాంగ్రెస్ ఉన్న‌ట్లు స‌మాచారం. ముంద‌స్తు దిశ‌గా కేసీఆర్ అడుగులు ప‌డుతుండ‌టంతో వివిధ పార్టీల‌తో పొత్తుల విష‌య‌మైన తెర వెనుక జోరుగా ప్ర‌య‌త్నాలు సాగుతున్న‌ట్లుగా చెబుతున్నారు.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. ఇప్ప‌టికే ప‌లు పార్టీల‌తో పొత్తు విష‌యంపై ప్రాధ‌మిక స్థాయిలో చ‌ర్చ‌లు పూర్తి అయిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌ధానంగా టీడీపీతో పొత్తు విష‌యంలో చ‌ర్చలు షురూ అయ్యాయ‌ని.. పొత్తుకు బాబు మొగ్గు చూపుతున్న‌ప్ప‌టికీ.. తెలంగాణ‌లో కాంగ్రెస్ తో పొత్తు.. ఏపీలో త‌న‌కు ప్ర‌తికూలంగా మారుతుందా? అన్న సందిగ్థంతో ఉన్న‌ట్లు స‌మాచారం.

కాంగ్రెస్ తో పొత్తు విష‌యంలో రెండు వ్యూహాల్లో బాబు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. అందులో మొద‌టి వ్యూహం పొత్తును బాహాటంగా చెప్పేసి బ‌రిలోకి దిగ‌టం అయితే రెండో వ్యూహంలో బూత్ స్థాయిలో కాంగ్రెస్.. టీడీపీల మ‌ధ్య ప‌క్కాగా స‌హ‌క‌రించుకోవ‌టంగా తెలుస్తోంది. ఈ రెండింటిలో ఏ వ్యూహాన్ని ఎంపిక చేసుకోవాల‌న్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఓవైపు బాబుతో సంప్ర‌దింపులు జ‌రుపుతూనే.. కోదండం మాష్టారితోనూ చ‌ర్చ‌లు మాజోరుగా సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. కేసీఆర్ ను గ‌ద్దె దించ‌ట‌మే ల‌క్ష్యంగా ఉన్న కోదండం మాష్టారు పొత్తు విష‌యంలో సానుకూలంగా ఉన్నార‌ని.. కాకుంటే పొత్తు చిక్కుమ‌డులు కొన్ని ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇక‌.. రెండు వామ‌ప‌క్ష పార్టీల్లో ఒక‌దానితో ఇప్ప‌టికే పొత్తుకు సంబంధించి ఓకే అయిపోయింద‌ని.. మ‌రో పార్టీతో సంప్ర‌దింపులు కీల‌క‌ద‌శ‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. టీఆర్ ఎస్ వ్య‌తిరేక ఓటు ఎట్టి ప‌రిస్థితుల్లో చీల‌కుండా ఉండేందుకు ఎన్ని దారులు ఎంచుకోవాలో.. అన్ని దారుల్లోనూ ప్ర‌య‌త్నాలు జ‌ర‌గాల‌న్న ప‌ట్టుద‌ల‌తో కాంగ్రెస్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ కోరుకున్న‌ట్లుగా పొత్తుల లెక్క‌లు ఒక కొలిక్కి వ‌స్తే.. కేసీఆర్ కు క‌ష్టాలు అంత‌కంత‌కూ ఎక్కువ కావ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.