Begin typing your search above and press return to search.

అసూయతోనే ప్రభుత్వంపై టీడీపీ, మీడియా దాడి

By:  Tupaki Desk   |   7 Sept 2021 5:00 AM IST
అసూయతోనే ప్రభుత్వంపై టీడీపీ, మీడియా దాడి
X
మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమిని జీర్ణించుకోలేకే చంద్రబాబు నాయుడు తో కలిసి వాళ్ళ మీడియా కూడా ప్రభుత్వంపై దాడి చేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి మండిపోయారు. ఉన్నతాధికారులతో రోడ్ల పరిస్ధితిపై జరిగిన సమీక్షలో మాట్లాడుతు తాము మద్దతుగా నిలిచే టీడీపీ ఘోరంగా ఓడిపోవటాన్ని చంద్రబాబు మీడియా తట్టుకోలేకపోతున్నట్లు జగన్ చెప్పారు. చంద్రబాబు+మీడియా అక్కసంతా ఉన్నతాధికారులపైన కాదని ఘోరంగా ఓడించిన తమపైనే అని జగన్ అధికారులకు క్లారిటీ ఇచ్చారు.

తమను మానసికంగా దెబ్బ కొట్టేందుకే ఉన్నతాధికారులను సదరు మీడియా టార్గెట్ చేసుకున్నట్లు వివరించారు. కాబట్టి ఉన్నతాధికారులపై మీడియాలో పదే పదే వచ్చే వార్తలు, కథనాలను యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరమే లేదని తేల్చేశారు. ప్రభుత్వ లక్ష్యాల ప్రకారం యంత్రాంగం తమ పని తాము చేసుకుపోవాలని గట్టిగా చెప్పారు. ఇపుడు రోడ్లపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో అర్ధమే లేదన్నారు.

ఎందుకంటే టీడీపీ హయాంలో వేసిన రోడ్లు నాసిరకం కావడంతో అవన్నీ పాడైపోయినట్లు జగన్ చెప్పారు. వర్షాలు తగ్గిపోగానే వచ్చే అక్టోబర్ లో రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పనులు మొదలుపెట్టాలని అధికారులకు జగన్ చెప్పారు. ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనిస్తున్నారని అందుకనే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తమకు అంతగా మద్దతుగా నిలిచినట్లు చెప్పుకొచ్చారు.

తమ ప్రభుత్వం అంటే ఏమిటి అనే విషయాన్ని జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలే తెలియజేస్తాయని కూడా జగన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రోడ్ల పరిస్ధితిపై అధికారులు ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితులను తెప్పించుకుని వర్షాకాలం అయిపోగానే వెంటనే మరమ్మతులకు దిగాలని గట్టిగా చెప్పారు. మీడియాలో వచ్చే వార్తలు, కథనాలను ఏమాత్రం పట్టించుకోవద్దని పదే పదే జగన్ చెప్పారు.