Begin typing your search above and press return to search.

ఆ ఒక్క కుటుంబంపై టీఆర్ ఎస్‌ - టీడీపీ న‌జ‌ర్‌

By:  Tupaki Desk   |   13 Nov 2017 2:14 PM GMT
ఆ ఒక్క కుటుంబంపై టీఆర్ ఎస్‌ - టీడీపీ న‌జ‌ర్‌
X
తెలంగాణ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాజీనామా స్పీక‌ర్‌కు చేర‌క‌పోవ‌డం - ఉప ఎన్నిక విష‌యంలో ఇంకా క్లారిటీ రాక‌పోయిన‌ప్ప‌టికీ...ఉప ఎన్నిక‌ల వేడి మాత్రం అందుకుంటోంది. ఏక్ష‌ణ‌మైనా ఉప ఎన్నిక రావ‌చ్చున‌నే ఉద్దేశంతో ఇటు రేవంత్ రెడ్డి, అటు అధికార టీఆర్ ఎస్ పార్టీ - రేవంత్ తాజా మాజీ గూడు అయిన టీడీపీ సైతం ఓ కుటుంబానికి వ‌ల వేస్తోంది. రేవంత్ రెడ్డి తాజా అడుగు ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన రోజు(గతనెల 28న) రాత్రి కోడంగల్‌ కు చేరుకున్నారు. ఉదయం కోడంగల్‌ లోని వెంకటేశ్వర ఆలయంకు కుటుంబ సమేతంగా వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా రేవంత్‌ రెడ్డి దంపతులు మాజీ ఎమ్మెల్యే నందారం అనురాధ ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు. దీన్ని బ‌ట్టే ఈ మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ప‌ట్టును అర్థం చేసుకోవ‌చ్చున‌ని అంటున్నారు. మ‌రోవైపు టీడీపీ అధినేత చంద్ర‌బాబు - టీఆర్ ఎస్ ముఖ్యులు సైతం ఈ కుటుంబంతో ట‌చ్‌ లో ఉండటం గ‌మ‌నార్హం.

రేవంత్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి భారీ ఓటు బ్యాంకు ఉంది. ఈ సామాజిక వర్గానికి చెందిన నందారం వెంకటయ్యకు గతం లో తెదేపా టిక్కెట్‌ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించింది. నందారం వెంకటయ్య మరణాంతరం ఆయన కుమారుడు నందారం సూర్యనారాయణను సైతం తెదేపా ఎమ్మెల్యేగా గెలిపించింది. నందారం కుటుంబం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వారి మంచితనం.. అవినీతి రహిత పాలన అక్కడి ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. దీంతో ప్రజల్లో వారికి చక్కటి సానుభూతి వచ్చింది. ప్రమాదంలో నందారం సూర్యనారాయణ ఎమ్మెల్యే హోదాలో మరణించారు. దీంతో కోడంగల్‌లో ఈ కుటుంబానికి ప్రజలు మరింత దగ్గరయ్యారు. ఆ తరువాత తెదేపా కొడంగల్‌ సీటును రేవంత్‌ రెడ్డి చేతిలో పెట్టింది. నందారం సూర్యనారాయణ భార్య నందారం అనురాధ క్రియాశీలకంగానే ఉన్నారు. సూర్యనారాయణ సోదరుడు నందారం శ్రీనివాస్‌ కుమారుడు నందారం ప్రశాంత్‌ కోడంగల్‌ రాజకీయాలలో మరింత కీలకంగా మారిపోయారు.

టీడీపీకి రేవంత్ రెడ్డి గుడ్‌ బై చెప్పేయ‌డం, రాజీనామాతో ఉప ఎన్నిక ఖాయ‌మ‌నే తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఉప పోరు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్నట్లు గుర్తించిన రాజకీయ పార్టీలు కొడంగల్‌ లో బలమైన అభ్యర్థి కొరకు ప్రయత్నాలు ఆరంభించాయి. తెదేపా మరోసారి నందారం కుటుంబంకు టిక్కెట్‌ ఇవ్వాలని యోచిస్తోంది. తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఇప్పటికే నందారం అనురాధతో మాట్లాడినట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు నందారం ప్రశాంత్‌ ను టీఆర్‌ ఎస్‌ లోకి రప్పించడానికి అగ్రనేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మ‌రోవైపు రేవంత్ రెడ్డి సైతం అల‌ర్ట్ అయ్యారు. నందారం ప్రశాంత్‌ చేజారకుండా ఉండేందుకు ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ఆయన సోదరుడు తిరుపతిరెడ్డిలు అనునిత్యం ప్రశాంత్‌ ను వెంటబెట్టుకొని ఉంటున్నారు. నందారం కుటుంబ అండదండల కొరకు కాంగ్రెస్‌ కు చెందిన రేవంత్‌ రెడ్డి.. వారి కుటుంబానికి టిక్కెట్‌ ఇవ్వాలని తెదేపా నందారం ప్రశాంత్‌ కొరకు టీఆర్‌ ఎస్‌ చేస్తున్న ప్రయత్నాలతో కొడంగల్‌ నియోజకవర్గంలో వారు ఎంత కీలకంగా ఉన్నారు అనేది స్పష్టమవుతోంది. ఈ కుటుంబానికి కొడంగల్‌ ప్రజలలో ఉన్న అభిమానాన్ని రాజకీయ పార్టీలు అనువుగా మలుచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల అన్నీఇన్నీ కావంటున్నారు. ఈ నేపధ్యంలో నందారం కుటుంబం ఎవరి వెంట నడుస్తుందో వేచిచూడాలి. కాగా, ప్రస్తుతానికి నందారం అనురాధ తెదేపాలోనే ఉన్నట్లు ప్రకటించారు. దీంతో పొలిటిక‌ల్ హీట్ మ‌రింత పెరిగింది.