Begin typing your search above and press return to search.

టీడీపీ, వైసీపీలు ప్రాంతీయ పార్టీలు మాత్రమే

By:  Tupaki Desk   |   25 Sep 2021 6:30 AM GMT
టీడీపీ, వైసీపీలు ప్రాంతీయ పార్టీలు మాత్రమే
X
తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు అండ్ కో ఎంతమాత్రం జాతీయ పార్టీగా క్లైం చేసుకునేందుకు లేదు. ఎందుకంటే టీడీపీ కేవలం ప్రాంతీయ పార్టీ మాత్రమే అని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం గా ప్రకటించింది. తమ పార్టీకి జాతీయ పార్టీ అని చెప్పుకునేంత సీన్ లేదని చంద్రబాబు అండ్ కోకు బాగా తెలుసు. అయినా కమిషన్ గుర్తింపును పట్టించుకోకుండా తమకు తాము తమ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించేసుకున్నారు టీడీపీ నేతలు.

జాతీయ పార్టీగా ప్రకటించేసుకోవటమే కాకుండా ఏకంగా జాతీయ అధ్యక్షుడిగా తనను తాను చంద్రబాబు నియమించేసుకోవటమే విచిత్రం. టీడీపీ కమిటీల్లో రెండు రకాలు కమిటీలున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు వ్యవహరిస్తుంటే రాష్ట్ర అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు ని ప్రకటించారు. అలాగే జాతీయ పార్టీకి, రాష్ట్ర పార్టీకి వేర్వేరుగా ప్రధాన కార్యదర్శులను, జాయింట్ సెక్రటరీలను, ఉపాధ్యక్షులను, సభ్యులను కూడా చంద్రబాబు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.

తాము కేవలం ప్రకటించుకోవటమే కాకుండా ఈ మేరకు వేర్వేరుగా లెటర్ హెడ్లు కూడా ప్రింట్ చేసి ఉపయోగించుకుంటున్నారు. పార్టీ శాలను ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినంత మాత్రాన టీడీపీ జాతీయ పార్టీ అయిపోదు. పార్టీ సాధించిన ఓట్లు, సీట్లను బట్టే సదరు పార్టీ జాతీయ పార్టీయా లేకపోతే ప్రాంతీయ పార్టీయా అని కేంద్ర ఎన్నికల కమిషన్ డిసైడ్ చేస్తుంది. ఈ ప్రాతిపదికన టీడీపీ ప్రాంతీయ పార్టీ మాత్రమే అని గతంలోనే కమిషన్ ప్రకటించింది.

అయినా కమిషన్ ప్రకటనను పట్టించుకోకుండా టీడీపీని జాతీయ పార్టీగా చంద్రబాబు ప్రకటించేసుకోవటమే విచిత్రం. టీడీపీ ఏర్పాటైన దగ్గర నుండి ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా అసెంబ్లీ, పార్లమెంటుకు పోటీచేయలేదు. కాబట్టి జాతీయ పార్టీగా చెప్పుకునేందుకు లేదు. ఇదే సమస్య వైసీపీ కూడా ఎదురవుతోంది. కాకపోతే టీడీపీ-వైసీపీ మధ్య ఓ తేడా ఉంది. అదేమిటంటే వైసీపీ కూడా తమది జాతీయపార్టీయే అని చెప్పుకుంటున్నా అది కేవలం చెప్పుకోవటానికి మాత్రమే పరిమితమైంది.

టీడీపీ లాగ వైసీపీ జాతీయ కమిటీ, ప్రాంతీయ కమిటీలని రెండు కమిటీలను ప్రకటించలేదు. లెటర్ హెడ్లు, సోషల్ మీడియా వేదికల్లో మాత్రమే చెప్పుకుంటున్నారు వైసీపీ నేతలు. ఎంఐఎం పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. కాకపోతే టీడీపీ, వైసీపీ కన్నా ఎంఐఎం చాలా మేలనే చెప్పాలి. ఎందుకంటే మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, గుజరాత్, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో పోటీచేసింది. మహారాష్ట్రలో ఇద్దరు, బీహార్లో ఐదుగురు ఎంఎల్ఏలున్నారు ఎంఐఎంకి. రేపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా పోటీచేయటానికి రెడీ అవుతోంది. జాతీయ పార్టీగా చెప్పుకోవటమే కాకుండా నిజమైన జాతీయపార్టీగా ఎదిగేందుకు గట్టిగా ప్రయత్నాలూ చేస్తోంది.