Begin typing your search above and press return to search.

సప్తగిరి సర్కిల్ లో అసలేమైంది..?

By:  Tupaki Desk   |   6 Jun 2016 4:43 AM GMT
సప్తగిరి సర్కిల్ లో అసలేమైంది..?
X
ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న రైతు భరోసాయాత్ర తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయటం తెలిసిందే. ఈ యాత్ర సందర్భంగా జగన్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో.. జగన్ యాత్రను నిలువరించేందుకు.. జగన్ ను తమ నిరసన తెలియజేసేందుకు తెలుగుదేశం శ్రేణులు విపరీతంగా ప్రయత్నించాయి. ఇందులో భాగంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అనంతపురం జిల్లా పర్యటనలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనా అనంతపురం పట్టణంలోని సప్తగిరి సర్కిల్ వద్ద మాత్రం ఆందోళన కలిగించే అంశాలు చోటు చేసుకోవటం గమనార్హం.

అనంతపురం పట్టణంలో జగన్ పర్యటన సందర్భంగా సప్తగిరి సర్కిల్ దగ్గర పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. కార్యకర్తలు చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్ కు నిలువరించే ప్రయత్నాన్ని టీడీపీ కార్యర్తలు చేసే ప్రయత్నంచేశారు. దీంతో.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సప్తగిరి సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున జమ అయిన జగన్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడికి దిగినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యాలు చెబుతున్నారు.

అయితే.. దీనిపై టీడీపీ నేతల వెర్షన్ వేరుగా ఉంది. తమ అధినేతపై వివాదాస్ప వ్యాఖ్యలు చేస్తున్న జగన్ కు నిరసన తెలిపేందుకు తాము వెళితే.. జగన్ పార్టీ నేతలు అనుచితంగా వ్యవహరించారని.. దాడికి దిగారని.. వారిని ప్రతిఘటించే క్రమంలో తమ కార్యకర్తలకు గాయాలు అయినట్లుగా చెబుతున్నారు. ఇదే ఉదంతంపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతల వెర్షన్ వేరుగా ఉంది. సప్తగిరి సర్కిల్ దగ్గరకు వచ్చే తమ అధినేతకు స్వాగతం పలికేందుకు తాము ఉంటే.. టీడీపీ శ్రేణులు తమపై వచ్చి రావటంతోనే దాడులు చేసినట్లుగా ఆరోపిస్తున్నారు.

ఇరువర్గాల మధ్య దాడులు మొదలై.. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న క్రమంలోపోలీసులు జోక్యం చేసుకొని.. ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కొంతమంది టీడీపీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అక్కడ నుంచి తరలించినట్లుగా చెబుతున్నారు. మరోవైపు టీడీపీ శ్రేణుల దాడుల్లో గాయపడిన జగన్ పార్టీ కార్యకర్తల్ని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏమైనా అనంతపురం జిల్లాలో జరిగిన జగన్ పర్యటనలో మరెక్కడా చోటు చేసుకోని విధంగా సప్తగిరి సర్కిల్ వద్ద ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని చెప్పొచ్చు.