Begin typing your search above and press return to search.

రాజాసింగ్ వ్య‌వ‌హారంపై టీడీపీ, వైసీపీలు మౌనం.. ఆ పార్టీల‌కే ఎస‌రు పెడుతుందా?

By:  Tupaki Desk   |   25 Aug 2022 11:30 AM GMT
రాజాసింగ్ వ్య‌వ‌హారంపై టీడీపీ, వైసీపీలు మౌనం.. ఆ పార్టీల‌కే ఎస‌రు పెడుతుందా?
X
తెలుగు రాష్ట్రాల‌నే కాదు.. మొత్తం దేశాన్ని సైతం కుదిపేసిన వ్య‌వ‌హారం.. తెలంగాణ‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే.. రాజాసింగ్ వ్య‌వ‌హారం. ఆయ‌న ఆది నుంచి కూడా దూకుడుగా ఉన్న నాయ‌కుడు. హిందూత్వాన్ని పుణికి పుచ్చుకున్న నాయ‌కుల్లో ఆయ‌న ఒకరు. ఎప్పుడు ఎక్క‌డ ఆయ‌న నోరు విప్పినా.. వివాదాలు.. విమ‌ర్శ‌ల‌తోనే కాలం గ‌డుపుతున్నార‌నే పేరు తెచ్చుకున్నారు. తాజాగా మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్తపై విమ‌ర్శ‌లు చేశార‌నేది.. ప్ర‌ధాన అభియోగం. ఆయ‌న ఏమ‌న్నా కూడా.. మ‌తానికి సంబందించిన విష‌యం కావ‌డంతో వెంట‌నే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాక రేగింది.

వాస్త‌వానికి రాజాసింగ్ తెలంగాణ‌కు చెందిన ఎమ్మెల్యే. సో.. ఆయ‌న వ్యాఖ్య‌లు అక్క‌డికే ప‌రిమితం కావాలి. కానీ, చేసిన వ్యాఖ్య ల తీవ్ర‌త నేప‌థ్యంలో అవి ఏపీకి కూడా పాకాయి. ఇక్క‌డ కూడా ముస్లిం సంఘాలు తీవ్రంగా రియాక్ట్ అయ్యాయి. రాజా సింగ్‌పై రాజీలేని పోరాటం చేస్తామ‌ని.. ఆయ‌న పై దేశ ద్రోహం కేసు న‌మోదు చేయాల‌ని.. ముస్లిం సంఘాల పెద్ద‌లు డిమాండ్ చేశారు. అంతేకాదు.. త‌మ ప‌క్షాన ఉండే రాజ‌కీయ పార్టీల‌తో క‌లిసి.. తాము రాబోయే రోజుల్లో ఉద్య‌మాలు కూడా చేస్తామ‌ని ప్ర‌క‌టించాయి. ప్ర‌స్తుతం ముస్లింల ప‌క్షాన మాట్లాడుతున్న పార్టీ ఎంఐఎం మాత్ర‌మే.

ఆ పార్టీకి ఏపీలో పెద్ద‌గా క్యాడ‌ర్ లేదు. ఉన్న క్యాడ‌ర్ అంతా కూడా హైద‌రాబాద్ తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల‌కు ప‌రిమితం. ఇక‌, ఏపీలో ముస్లింల ప‌క్షాన నిలిచిన పార్టీలు.. వైసీపీ, టీడీపీలు. ఈ రెండు పార్టీల్లోనూ.. వైసీపీ మ‌రింత‌గా ముస్లింల ప‌క్షాన నిలిచింది.

కాని, ఇప్పుడు జ‌రిగిన ఘ‌ట‌న‌పై ఈ రెండు పార్టీలు కూడా మౌనంగా ఉన్నాయి. త‌ప్పో.. ఒప్పో.. తేల్చ‌క‌పోయినా.. క‌నీసం ఖండ‌న కూడా చేయ‌లేదు. రాజా సింగ్ వ్య‌వ‌హారాన్ని బీజేపీ వ్య‌వ‌హారంగా చూస్తుండ‌డ‌మే దీనికి ప్ర‌దాన స‌మ‌స్య‌గా మారిపోయింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని ముస్లింల‌కు ఇప్పుడు ఈ రెండు పార్టీలు ద‌న్నుగా నిల‌వ‌క‌పోతే.. గ్యాప్ ఏర్ప‌డ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.

ఇక‌, ఈ గ్యాప్‌ను క‌నుక త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ఎంఐఎం.. ప్ర‌య‌త్నిస్తే.. ప‌రిస్థితి ఏంటి? కీల‌క‌మైన మైనారిటీ ఓటు బ్యాంకు కాస్తా.. ఎంఐఎంవైపు మ‌ళ్ల‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలువ‌స్తున్నాయి. దీనిపై తాజాగా ఓవైసీ కూడా స్పందించారు.

రాజా సింగ్ వ్య‌వ‌హారాన్ని తాఉ వ‌దిలి పెట్టేది లేద‌ని.. త్వ‌ర‌లోనే అన్ని రాష్ట్రాల్లోనూ ప‌ర్య‌టించి.. ముస్లింల‌ను సంఘ‌టితం చేస్తామ‌న్నారు. దీనిలో ఏపీకూడా ఉంద‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సో.. మొత్తానికి టీడీపీ-వైసీపీల మౌనం ఆ పార్టీల‌కే ఎస‌రు పెడుతుందా? అనే సందేహాలు వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం.