Begin typing your search above and press return to search.

మాకు.. 110.. మాకూ 110..వైసీపీ - టీడీపీ సంబరాలు!

By:  Tupaki Desk   |   2 March 2019 6:16 AM GMT
మాకు.. 110.. మాకూ 110..వైసీపీ - టీడీపీ సంబరాలు!
X
ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో పార్టీలు సర్వేల మీద పడ్డాయి. తమ తమ బలాబలాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవడానికి సర్వేలను చేయించుకొంటూ ఉన్నాయి. ఒకవైపు మీడియా సంస్థల సర్వేలు - అంచనాలు వెలువడుతూ ఉండగా.. మరోవైపు పార్టీలు కూడా సొంతంగా సర్వేలు చేయించుకొంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రధాన పార్టీలు కూడా ఈ విషయంలో తమ తమ అంచనాలను వేయించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

విశేషం ఏమిటంటే..ఏపీలో రెండు ప్రధాన పార్టీల సొంత సర్వేలూ ఆయా పార్టీలే గెలుస్తాయని చెబుతున్నాయట. తాజాగా తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇంటెలిజెన్స్ తో చేయించుకున్న సర్వేలో టీడీపీకి 110 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలిందట. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు తన పార్టీనేతలకు ఉత్సాహంగా చెప్పినట్టుగా తెలుస్తోంది.

విశేషం ఏమిటంటే.. ఇటీవల జగన్ కోసం పీకే టీమ్ చేయించిన సర్వేలో కూడా 110 నంబర్ ప్రముఖంగా వచ్చిందట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో 110 అసెంబ్లీ సీట్లను నెగ్గుతుందని ఆ సర్వే పేర్కొందట. ఇలా రెండు పార్టీలూ తమ తమ వాళ్లతో చేయించుకున్న సర్వేల్లో.. తమకు ఒకే నంబర్ సీట్లు వస్తాయని తేల్చుకోవడం విశేషం.

అయితే వాళ్లకు వాళ్లు వాళ్ల వాళ్లతో చేయించుకున్న సర్వేల్లో వచ్చిన ఈ ఫలితాలు ఎంత వరకూ నిజం అనేదే ప్రశ్నార్థకం. సాధారణంగా ఏ పార్టీ వాళ్లు సర్వే చేయించుకుంటే ఆ పార్టీకి అనుకూలంగానే రిపోర్ట్స్ వస్తాయి. థర్డ్ పార్టీలకు బాధ్యతలు ఇచ్చి సర్వే లు చేయించుకున్నా ఇదే పరిస్థితి తప్పదు. ఎవరి కోసం అయితే తాము సర్వే చేస్తున్నామో.. వాళ్లకు ఐదు శాతం అనుకూలంగా రిపోర్ట్స్ ఇవ్వడం సర్వేలు చేసే వాళ్లకు అలవాటే.

ఫలితంగా అటు తెలుగుదేశం ఇంటెలిజెన్స్ తో చేయించుకున్న సర్వేలో ఆ పార్టీకి అనుకూలంగా - ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీకే టీమ్ తో చేయించుకున్న సర్వేలో ఆ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చి ఉండవచ్చు. వీటిని చూసి మురిసిపోతే ఆయా పార్టీల నేతలకు మించిన తప్పు మరొకటి ఉండకపోవచ్చు.

ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాలేదు.. పోలింగ్ రోజున ప్రజలు ఎటు మొగ్గుచూపుతారు అనేదాన్ని బట్టి అసలు కథ ఆధారపడి ఉంటుంది. అంత వరకూ ఈ సర్వేలన్నీ ఉత్తుత్తివే.. అని మాత్రం ఖాయంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకూ ఉన్న అవకాశాలు ఇద్దరికీ సమంగా ఉన్నాయి, పోల్ మేనేజ్ మెంట్ ఎవరు చేసుకొంటే వాళ్లనే విజయం వరించవచ్చు.