Begin typing your search above and press return to search.

బెంగళూరులో టీడీపీ - వైఎస్సార్‌ సీపీ ప్రచార హోరు

By:  Tupaki Desk   |   3 April 2019 1:30 AM GMT
బెంగళూరులో టీడీపీ - వైఎస్సార్‌ సీపీ ప్రచార హోరు
X
సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి రావడంతో ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల సందడి ఊపందుకుంది. పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటం.. ప్రచారం గడువు ముంచుకొస్తుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఏపీలోని అన్ని జిల్లాలతో పాటు పక్క రాష్ట్రంలో ఉన్న ఓటర్లను సైతం చైతన్య పరుస్తున్నారు. పొరుగు రాష్ట్రంలోని బెంగళూరులో కూడా తెలుగుదేశం - వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. నాయకులు ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. తమ నియోజకవర్గాల్లోని ప్రజలు వృత్తిరీత్యా వేల మంది బెంగళూరులో నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు ఆత్మీయ సమ్మేళనం పేరుతో సభలు - సమావేశాలు నిర్వహించి ఓటర్లను ఆకర్షిస్తున్నారు.

ప్రతి ఒక్కరు స్వగ్రామానికి వచ్చి పోలింగ్‌ లో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరుతున్నారు. గెలిచిన వెంటనే స్థానికంగా ఉపాధి కల్పిస్తామని.. వలస రావాల్సిన పని ఉండదని భరోసా ఇస్తున్నారు. సొంత ఊళ్లలో ఉన్న భూములు వదిలి.. బంధువులకు దూరంగా.. ఇక్కడ వచ్చి ఉండేందుకు తమకు ఇష్టం లేదని ప్రవాసాంధ్రులు వాపోతున్నారు. అయితే గత్యంతరం లేక ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్‌ రాయలసీమ పరిధిలోని అనంతపురం - కర్నూలు - చిత్తూరు - కడప - నెల్లూరు - ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారు బెంగళూరులో వివిధ ఫ్యాక్టరీల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఈసందర్భంగా బెంగళూరులో ఆత్మీయ సమ్మేళనానికి వస్తున్న నాయకులు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని.. వలస రావాల్సిన పని ఉండదని భరోసా ఇస్తున్నారు. మళ్లీ సొంత ఊళ్లకు వచ్చి పంటలు వేసుకోవచ్చని హామీ ఇస్తున్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. స్థానికంగా ఉపాధి కల్పిస్తాం. యువతకు నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని వలస వచ్చిన ఆంధ్రులకు భరోసా కల్పిస్తున్నారు. ఏపీ నుంచి నాయకులు వచ్చిన ప్రతిసారీ మన నాయకుడు వచ్చాడు.. అని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకు బెంగళూరులో ప్రచారానికి వచ్చిన నాయకులు

– కళ్యాణదుర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్‌.రఘువీరారెడ్డి కర్ణాటకలోని కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఆంధ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి హిందూపురం ఎంపీ అభ్యర్థి కేటీ శ్రీధర్ - అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థి జి.నాగరాజు హాజరయ్యారు.

– రాప్తాడు తెలుగుదేశం అభ్యర్థి పరిటాల శ్రీరామ్ - మంత్రి పరిటాల సునీతమ్మ బెంగళూరులో ప్రచారం నిర్వహించారు. రాజాజీనగరలోని ఓ ప్రైవేటు భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు.

– వైఎస్సార్‌ సీపీ తరఫున రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి మెజిస్టిక్‌ సమీపంలో ఓ హాలు సమావేశం ఏర్పాటు చేసి ప్రవాసాంధ్రులతో మాట్లాడారు. ఆయనతో పాటు వైఎస్సార్‌ సీపీ నాయకులు నదీం అహ్మద్ - రాజారాం - కోగటం విజయభాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు

– హిందూపురం నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శ్రీనివాస్‌ తో పాటు మరికొందరు టీడీపీ నాయకులు యలహంకలో ప్రచారం చేశారు. అక్కడ నివసిస్తున్న హిందూపురం ఓటర్లను చైతన్య పర్చి పోలింగ్‌ రోజున వచ్చి ఓటు వేయాలని కోరారు.

– పెనుకొండ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర్‌ నారాయణ బొమ్మనహళ్లి - హొంగసంద్ర ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు నియోజకవర్గంలోని పలువురు నాయకులు తరలివచ్చారు.

– కదిరి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి డాక్టర్‌ పీవీ సిద్ధారెడ్డి ఎలక్ట్రానిక్‌ సిటీలో ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు.

– ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ కుందనహళ్లిలో ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో సమావేశం ఏర్పాటు చేశారు.

– నెల్లూరు జిల్లా ఉదయగిరి అభ్యర్థి - మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి బెంగళూరులో తమ నియోజకవర్గ ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం పేరుతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.

– నగరి అభ్యర్థి ఆర్‌ కే రోజా నాగవారలోని ఓ ప్రైవేటు హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఆమెతో పాటు వైఎస్సార్‌ సీపీ నేతలు అంబటి రాంబాబు - కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌ రెడ్డి - ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు.

– పలమనేరు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి వెంకటేగౌడ ఆవులహళ్లిలో సమావేశం నిర్వహించి ఓటర్లను ఆకర్షించారు.

– కడప జిల్లా బద్వేలు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి డాక్టర్‌ జి.వెంకటసుబ్బయ్య కుందనహళ్లిలో ఆత్మీయ సమ్మేళనం పేరుతో సమావేశం ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యారు. ఆయనతో పాటు కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి - కడప మేయర్‌ సురేశ్‌ బాబు తదితరులు హాజరయ్యారు.

– అనంతపురం జిల్లా శింగనమల నాయకులు ఆలూరి సాంబశివారెడ్డి జక్కూరు లేఅవుట్‌ లో నియోజకవర్గ ప్రజలతో కలిశారు. ఈసందర్భంగా స్వస్థలాలకు తరలివచ్చి స్ధిరపడాలని కోరారు.