Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల‌కు చుక్క‌లు చూపిస్తున్న జ‌న్మ‌భూమి

By:  Tupaki Desk   |   4 Jan 2017 9:24 AM GMT
త‌మ్ముళ్ల‌కు చుక్క‌లు చూపిస్తున్న జ‌న్మ‌భూమి
X
తెలుగుదేశం పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మం ర‌చ్చ‌రచ్చ‌గా మారుతోంది.ఒక‌వైపు టీడీపీ మంత్రులు - ఎమ్మెల్యేలు - నాయ‌కుల‌కు ప్ర‌జ‌ల నుంచి తీవ్ర నిర‌స‌న ఎదుర‌వుతుండ‌గా మ‌రోవైపు ఈ కార్య‌క్ర‌మాల వేదిక‌గానే కుర్చీలు విసురుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో జ‌న్మ‌భూమి అంటేనే త‌మ్మళ్లు వణికిపోతున్నారు. టీడీపీ సర్కారు అధికారంలోకొచ్చి రెండున్నరేళ్లయిందనీ - ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని మంత్రులు - ఎంపీలను ప్రజలు నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి సభలలో సమస్యలపై ప్రజాప్రతినిధులను, అధికారులను ఇదే రీతిలో విప‌క్ష నాయకులు ప్రశ్నించారు.

కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు - ఎంపి కేశినేని శ్రీనివాస్‌లను సీపీఎం నాయకులు నిలదీశారు. రెండేళ్ల‌లో ఏం చేశారో చెప్పాల‌ని కోరారు. పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం బండివారిగూడెంలో సిసి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో టీడీపీ - వైసీపీల మధ్య ఘర్షణకు - తోపులాటకు దారి తీసింది. రోడ్డు పనులు ప్రారంభిస్తుండగా వైసీపీకి చెందిన సర్పంచి బూక్యా శ్యామల - ఆ పార్టీ నాయకులు వచ్చి అడ్డుకున్నారు. పంచాయతీ అనుమతి లేకుండా పనులెలా చేపడతారంటూ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం దుద్దేబండ గ్రామంలో టీడీపీ - వైసీపీ నాయకుల మధ్య వాగ్వివాదం పెరిగి కుర్చీలు విసిరేసుకున్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం స్థానిక సర్పంచిని పిలవకుండా - సమాచారం లేకుండా ఎలా నిర్వహిస్తారని సర్పంచి శ్రీకాంత్‌ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీటీసీ రామ్మోహన్‌ రెడ్డి స్థానిక ప్రజాసమస్యలపై ఎంపిడిఒ శివానందనాయక్‌ అధికారులను నిలదీశారు. దీంతో అక్కడున్న టీడీపీ నాయకులు వైసీపీ నేత‌ల‌తో వాగ్వివాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు పార్టీల నాయకులకు సర్ది చెప్పారు. సర్పంచి శ్రీకాంత్‌ రెడ్డి - ఎంపిటిసి రాంమోహన్‌ రెడ్డిలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌ కు తరలించారు. ప్రజాసమస్యలపై అడుగుతున్న తమపై టీడీపీ నాయకులు దాడి చేశారని వైసీపీ నాయకులు స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు.మొత్తంగా త‌మ‌ను ఇర‌కాటంలో ప‌డేసింద‌ని తెలుగు త‌మ్ముళ్లు బాహ‌టంగానే పేర్కొంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/