Begin typing your search above and press return to search.

అసమ్మతి భగ్గుమంటున్న.. ఆయనకే టీడీపీ టికెట్!

By:  Tupaki Desk   |   8 March 2019 8:35 AM GMT
అసమ్మతి భగ్గుమంటున్న.. ఆయనకే టీడీపీ టికెట్!
X
ఒక వైపు వాళ్లకు టికెట్ ఇస్తే ఓడించి తీరతామని పార్టీ నేతలే ప్రతినబూనుతున్నారు. పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఇలాంటి వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉంది. వారి విషయంలో అసంతృప్త నేతలు ఇప్పటికే వీధికి ఎక్కారు. అయినా చంద్రబాబు నాయుడు అసమ్మతి నేతలను కొన్ని చోట్ల ఖాతరు చేయడం లేదు. ఆ అసమ్మతి వర్గం బలంగా కనిపిస్తున్నా బాబు.. అలాంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నేతకే టికెట్ ను ఖరారు చేస్తూ ఉండటం ఆసక్తిదాయకంగా మారింది.

అందుకు ఉదాహరణల్లో ఒకటి.. అనంతపురం ఎమ్మెల్యే టికెట్ వ్యవహారం. ఈ టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికే ఖరారు చేసినట్టుగా తెలుగుదేశం పార్టీ మీడియాకు లీకు ఇచ్చింది. గత ఎన్నికల్లో నెగ్గిన చౌదరినే ఈ సారి కూడా పోటీ చేయించాలని బాబు అనుకుంటున్నారట. అయితే ప్రభాకర్ చౌదరి అభ్యర్థిత్వం పట్ల నియోజకవర్గంలో తీవ్రమైన అసహనం వ్యక్తం అవుతూ ఉంది.

ఈ విషయంలో నేతలు తమ అసహనాన్ని బహిరంగంగానే చాటారు. ప్రభాకర్ చౌదరికి జేసీ వర్గానికి మొదటి నుంచి పడటంలేదు. అనంతపురం ఎమ్మెల్యే టికెట్ ను రెడ్డి కులస్తుడికి ఇస్తే మేలు జరుగుతుంది అనేది జేసీ థియరీ. అయితే బాబు దాన్ని పట్టించుకోవడం లేదని తేలిపోయింది. చౌదరికే టికెట్ ను ఖరారు చేసినట్టే అనడంతో.. జేసీ వర్గం వాదనను బాబు పట్టించుకోలేదు.

ఇక మైనారిటీ వర్గం కూడా ఈ విషయంలో బాగా అసహనంతో ఉంది. గతంలో ఈ సీటు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి సైపుల్లా వర్గం తీవ్రమైన ఎదురుదెబ్బ తింది. అప్పట్లో టీడీపీ తరఫున ఓడిన సైపుల్లా తనయుడు ఓటమి భారంతో అత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు సైపుల్లా వర్గం తమకు టికెట్ ఇవ్వాలని అంటోంది. వారు పలు మీటింగులు కూడా పెట్టారు. అయినా కూడా బాబు వారిని కూడా లెక్క చేయకపోవడం విశేషం.

ఏకంగా రెండు అసమ్మతి వర్గాలు భగ్గుమంటున్నా టీడీపీ టికెట్ ను మాత్రం ప్రభాకర్ చౌదరికే ఖరారు చేశారు. ప్రభాకర్ చౌదరిని అభ్యర్థిగా ఖరారు చేసిన సమావేశాన్ని జేసీ వర్గం బాయ్ కాట్ చేసింది. ఇక చౌదరికి టికెట్ అంటే రాజీనామానే అని సైపుల్లా వర్గం ప్రకటించింది. ఇలాంటి నేపథ్యంలో అనంతపురం ఎమ్మెల్యే సీటు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. నామినేషన్ల సమయానికి అసమ్మతి వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి!