Begin typing your search above and press return to search.

ముందు బుర‌ద జ‌ల్లేద్దాం.. జ‌గ‌నే తుడిచుకుంటాడు!

By:  Tupaki Desk   |   16 Sep 2020 11:30 PM GMT
ముందు బుర‌ద జ‌ల్లేద్దాం.. జ‌గ‌నే తుడిచుకుంటాడు!
X
రాజ‌కీయాల్లో వ్యూహాలు మార్చుకోవ‌డం అనేది ఎప్పుడూ ఉన్న‌దే. ఏ స‌మ‌యానికి త‌గిన విధంగా ఆయా అంశాల‌ను బ‌ట్టి.. ప్ర‌భుత్వంలోని పార్టీపైనా, నేత‌ల‌పైనా ప్ర‌తిప‌క్షాలు వ్యూహాత్మ‌కంగా దాడులు చేయ‌డం రాజ‌కీయాల్లో కొత్తేంకాదు. అస‌లు ఇలాంటి వ్యూహాలు లేక‌పోతే.. అవి రాజ‌కీయాలే కావు! అయితే... ఈ వ్యూహాల్లో చిత్ర‌మైన ప‌రిస్థితి ఇప్పుడు ఏపీలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రాష్ట్రంలో ఏం జ‌రిగినా.. ముందు.. దానిని ప్ర‌భుత్వానికి ముడి పెట్టేసి.. విప‌రీత వ్య‌తిరేక ప్ర‌చారం చేసేయ‌డం ప్ర‌తిప‌క్షం టీడీపీకి అల‌వాటుగా మారిపోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

త‌న‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేని వారు.. తాను ఎద‌గ‌లేక‌పోతున్నాన‌నే భావ‌న ఉన్న‌వారు.. స‌హజంగానే ఎదుగుతున్న వారిని కింద‌కి లాగేసే ప్ర‌య‌త్నం చేస్తార‌ని అంటారు. ఇప్పుడు అలాగే ఉంది ఏపీలో ప‌రిణామం. రాష్ట్రంలో ఒకే రోజు రెండు ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక‌టి విజ‌య‌వాడ క‌న‌క దుర్గ దేవాల‌యంలో వెండి ర‌థానికి ఉన్న నాలుగు వెండి తాప‌డం చేసిన సింహాల ప్ర‌తిమ‌ల్లో మూడు క‌నిపించ‌లేదు. ఇక‌, మాజీ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ ద‌మ్మాల‌పాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు న‌మోదు చేయ‌డం. ఈ రెండు ప‌రిణామాల్లో జ‌గ‌న్ ప్ర‌మేయం ఎంత వ‌ర‌కు ఉంటుంది? సాధారణంగా.. ఆలోచించినా.. ద‌మ్మాల‌పాటి వ్య‌వ‌హారాన్ని ప‌క్క‌న పెడితే.. దుర్గ‌గుడి వ్య‌వ‌హారంలో ఆయ‌న పాత్ర ఉండ‌దు క‌దా!

కానీ, టీడీపీ మాత్రం దుర్గ‌గుడికి సంబంధించి సింహాల ప్ర‌తిమ‌ల అదృశ్యం ఘ‌ట‌న‌ను వైసీపీకి ముడిపెట్టేసింది. దీనివెనుక వైసీపీ నాయ‌కుల హ‌స్తం ఉంద‌ని పెద్ద ఎత్తున త‌న అనుకూల మీడియాలో ప్ర‌చారం చేయిచింది. క‌థ‌నాలు కూడా రాయించింది. ఇక‌, ద‌మ్మాల‌పాటి విష‌యంలో ఆయ‌న రాజ‌ధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జ‌రిపార‌నేది.. ప్ర‌ధానంగా ఆరోప‌ణ‌. స‌హ‌జంగా ఇలాంటి ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు గ‌డిచిన ప‌దేళ్లుగా ఆయ‌న జ‌రిపిన లావేదేవీల విష‌యాన్ని ఏసీబీ అధికారులు తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఆయ‌న స్థానంలో వేరే వారు ఉన్న‌ప్ప‌టికీ.. అంతే!

కానీ, ఇదేదో మ‌హాప‌రాధం అన్న‌ట్టుగా టీడీపీ పేర్కొన‌డం, ఆ వెంట‌నే అనుకూల మీడియా విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేలా.. అదిగో అప్పుడెప్పుడో.. జ‌గ‌న్‌పై ఉన్న కేసుల విష‌యంలో ద‌మ్మాల‌పాటి వాదించారు కాబ‌ట్టి.. ఇప్పుడు క‌క్ష తీర్చుకుంటున్నారు.. అనే కోణంలో క‌థ‌నాలు రాసి.. బుర‌ద‌జ‌ల్లేయ‌డం చిత్రంగా అనిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ ప‌రిణామాలు.. ఇప్ప‌టికిప్పుడు.. టీడీపీకి ఏమేర‌కు మేలు చేస్తాయో చెప్ప‌లేం కానీ... జ‌గ‌న్‌పై మాత్రం మ‌ర‌క‌లు ప‌డాల‌నే టీడీపీ ప్ర‌య‌త్నం మాత్రం స్ప‌ష్టంగా తెలుస్తోంది. మ‌రి ఇలాంటి ప‌రిణామాలు అవ‌స‌ర‌మా? ఉన్న‌దిఉన్న‌ట్టు రాసేందుకు, చెప్పేందుకు ఎందుకు ప్ర‌య‌త్నించ‌డం లేదు. ఇలా చేసుకునే క‌దా.. గ‌త ఏడాది అధికారం పోగొట్టుకున్నారు! అయినా మార్పు రాక‌పోతే.. ఎలా? అనేది ప‌రిశీల‌కుల మాట‌.