Begin typing your search above and press return to search.

వ‌లంటీర్లు దొంగ ఓట్లేస్తారు: టీడీపీ సీనియ‌ర్ నేత‌ కామెంట్స్ వైర‌ల్!

By:  Tupaki Desk   |   4 Aug 2022 5:30 PM GMT
వ‌లంటీర్లు దొంగ ఓట్లేస్తారు: టీడీపీ సీనియ‌ర్ నేత‌ కామెంట్స్ వైర‌ల్!
X
వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వలంటీర్లు దొంగ ఓట్లేస్తారు.. వీరితో జాగ్ర‌త్త‌గా ఉండండి.. అంటూ టీడీపీ ఏపీ ఉపాధ్య‌క్షుడు జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి. తూర్పు గోదావ‌రి జిల్లా గోక‌వ‌రంలో పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో నెహ్రూ చేసిన ఈ వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ గా మారాయి.

ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప్ర‌జ‌ల సేవ కోసం వ‌లంటీర్ల‌ను నియ‌మించ‌లేద‌ని ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై నిఘా కోసం, ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌లంటీర్ల‌ను ఉప‌యోగించుకుని ఓట‌ర్ల‌కు డ‌బ్బు, మ‌ద్యం పంపిణీకే వారిని పెట్టుకున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఇప్పుడు ఈ కోణంలోనే టీడీపీ ఏపీ ఉపాధ్య‌క్షుడు జ్యోతుల నెహ్రూ కూడా వలంటీర్ వ్య‌వ‌స్థ‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టీడీపీ ప్ర‌భంజ‌నం మొద‌లైంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని నెహ్రూ చెప్పారు.

అయితే జగన్ ప్రభుత్వం బలమైన వ‌లంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొంద‌ని నెహ్రూ చెప్పారు. వీరిని టీడీపీ కార్య‌క‌ర్త‌లు గ‌మ‌నిస్తూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరారు.

జ‌గ‌న్ ప్రభుత్వం వ‌లంటీర్ వ్య‌వ‌స్థ ద్వారా ప్రజలందరిపై నిఘా పెడుతూ సమాచారం సేకరిస్తోంద‌ని నెహ్రూ ఆరోపించారు. అంతేకాకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌లంటీర్ల‌తో దొంగ ఓట్లు కూడా వేయించే కుతంత్రానికి కూడా వైఎస్సార్సీపీ పాల్ప‌డే ప్ర‌మాదం ఉంద‌న్నారు. దీన్ని అడ్డుకోవాలంటే టీడీపీ సభ్యత్వం ఇంకా పెరగాల‌న్నారు. సభ్యత్వ నమోదు చురుకుగా చేయాల‌న్నారు.

కాగా గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ్గంపేట నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన జ్యోతుల నెహ్రూ వైఎస్సార్సీపీ అభ్య‌ర్థి జ్యోతుల చంటిబాబుపై ఓడిపోయారు. గ‌తంలో నెహ్రూ చిరంజీవి ఏర్పాటు చేసిన పీఆర్పీలో కూడా ఉన్నారు. 2009లో జ‌గ్గంపేట నుంచి పీఆర్పీ అభ్య‌ర్థిగా పోటీ చేసి స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. ఆ త‌ర్వాత వైఎస్సార్సీపీలో చేరిన నెహ్రూ 2014లో అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. మళ్లీ మ‌ధ్య‌లో టీడీపీలోకి ఫిరాయించారు.