Begin typing your search above and press return to search.

జగన్ అధికారం ఎన్ని రోజులంటే లెక్క కట్టి మరీ....?

By:  Tupaki Desk   |   2 March 2022 2:30 AM GMT
జగన్ అధికారం ఎన్ని రోజులంటే లెక్క కట్టి మరీ....?
X
ఏపీ సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చి ఎన్నాళ్ళు అయింది అంటే తడుముకోనవసరం లేదు, జవాబు ఠక్కున దొరుకుతుంది. దీనికి బుర్రలు కూడా ఎవరూ పాడుచేసుకోనవసరం లేదు. ఎందుకంటే జగన్ కుర్చీ ఎక్కిన దగ్గర నుంచి ప్రతీ రోజూ లెక్కేస్తున్న పార్టీ ఒకటుంది. అదే టీడీపీ. జగన్ నెల రోజులు పూర్తి చేశారు.

ఆరు నెలలు పాలన సాగింది. ఏడాదిలో ఆయన ఏం చేశారు. రెండేళ్ల ఏలుబడిలో ఏం వెలగబెట్టారు. మూడేళ్ళు అవుతున్నా అభివృద్ధి ఉందా ఇలా తమ్ముళ్ళ భారీ ప్రకటనలతో ఏపీలో జగన్ సీఎంగా ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నారు అన్నది రాజకీయాల మీద ఆసక్తి పెద్దగా లేని వారికి కూడా తెలిసిపోతోంది.

ఇక జగన్ ఎన్నాళ్ళు అధికారంలో ఉంటారు అంటే ఇది కూడా సామాన్యుడికి ఠక్కున చెప్పలేని ప్రశ్నే. అయితే అయిదేళ్ళు పదవి కాబట్టి రెండేళ్ళు అని ఉజ్జాయింపుగా ఎవరైనా చెబుతారు. కానీ టీడీపీ మాత్రం అంత సీన్ లేదు అంటోంది.

2024లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే మరి రెండేళ్లకు పైగా టైమ్ ఉంటుంది కదా అంటే అలా కాదమ్మా అంటున్నారు పొలిటికల్ గా తలపండిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు.

జగన్ చేతిలో నికరంగా పవర్ ఉండేది కేవలం పన్నెండు నెలలు మాత్రమే అని ఆయన అంటున్నారు. జగన్ తాను ఏపీకి శాశ్వతంగా ఏలికగా ఉంటానని జబర్దస్తు చేస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. నోరు విప్పి నిజాలు చెప్పే విపక్షాల మీద కేసులు పెట్టి మరీ ఇబ్బంది పెడుతున్నారు, కక్ష కట్టి మరీ రెస్ట్ చేయాలని చూస్తున్నారని అయ్యన్న ఫైర్ అయ్యారు.

అయితే జగన్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే తన చేతిలో అధికారం మరో ఏడాది మాత్రమే ఉంటుందని అని ఆయన అసలు నిజం చెప్పుకొచ్చారు. 2023 మే తరువాత ఏడాది మిగిలి ఉన్నా లాస్ట్ ఇయర్ ఏ అధికారీ జగన్ మాట వినరని, ఆఖరుకు పోలీసులు కూడా వినరంటే వినరని అనుభవ పూర్వకంగా ఆయన చెప్పుకొచ్చారు.

అందువల్ల అధికారం తన చేతిలో ఉందని మిడిసిపడకుండా జగన్ నాలుగు మంచి పనులు ఎలా చేయాలా అని ఆలోచించాలని ఆయన కోరారు. తన ఇంటి మీదకు వచ్చి అరెస్టు చేయాలని పోలీసులు టైమ్ వేస్ట్ చేసుకున్నారని ఆయన సెటైర్లు వేశారు.

దానికి బదులుగా విశాఖ ఏజెన్సీలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ మీద తమ ప్రతాపం చూపించాలని, అడ్డగోలుగా తవ్వుతున్న రంగురాళ్ళ దందాలను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.

పోలీసుల వద్ద ఈ అక్రమాల వివరాలు లేకపోతే తాను ఇస్తామని కూడా ఆయన అంటున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని జగన్ ఏపీలో పాలన చేస్తున్నారని, అయితే అధికారం చేతిలోది చాలా జోరుగానే కరిగిపోతోంది అన్న దాన్ని ఆయన గుర్తెరగాలని అయ్యన్న హెచ్చరించారు. మొత్తానికి జగన్ కేవలం ఏడాది మాత్రమే సీఎం అని అయ్యన్న అనేస్తున్నారు. ఒక విధంగా ఇది వైసీపీ నేతలను కలవరపెట్టే విషయమే మరి.