Begin typing your search above and press return to search.

అయ్య‌న్న‌పాత్రుడి ఇంటిపైకి బుల్డోజ‌ర్.. అరెస్టుకు రంగం సిద్దం!

By:  Tupaki Desk   |   19 Jun 2022 4:42 AM GMT
అయ్య‌న్న‌పాత్రుడి ఇంటిపైకి బుల్డోజ‌ర్.. అరెస్టుకు రంగం సిద్దం!
X
టీడీపీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడి అరెస్టుకు రంగం సిద్ధ‌మైంది. ఆయ‌న‌ను ఏ క్ష‌ణంలోనైనా జ‌గ‌న్ ప్ర‌భుత్వం అరెస్టు చేయించ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే భారీ బ‌ల‌గాల‌తో పోలీసులు అయ్య‌న్న‌పాత్రుడి ఇంటిని చుట్టుముట్టారు. న‌ర్సీప‌ట్నంలో ఆయ‌న ఇంటికి వెళ్లే రెండు మార్గాల్లో రాక‌పోక‌ల‌ను నిలిపివేశారు. టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఎవ‌రూ ఆయ‌న ఇంటికి రాకుండా ఎక్క‌డిక‌క్క‌డ నిర్బంధం విధించారు.

జూన్ 19న తెల్ల‌వారుజామున భారీ స్థాయిలో చేరుకున్న పోలీసులు, న‌ర్సీప‌ట్నం పోలీసు అధికారులు అయ్య‌న్న‌పాత్రుడి ఇంటి గోడ‌ను కూల్చివేశారు. ప్ర‌భుత్వ స్థ‌లంలో రెండు సెంట్ల‌ను ఆక్ర‌మించి ప్ర‌హారీ నిర్మించార‌ని.. అందుకే కూల్చివేస్తున్నామంటూ పేర్కొన్నారు. అలాగే ఇంటి వెనుక వైపు వంట గ‌ది కూడా ప్ర‌భుత్వ స్థ‌లంలోనే ఉంద‌ని.. అది కూడా అక్ర‌మ నిర్మాణ‌మేన‌ని పేర్కొంటూ దాన్ని కూడా కూల్చివేస్తున్నారు. ఇందుకు సంబంధించి జూన్ 2నే జారీ చేసిన‌ట్టు ఉన్న నోటీసును అయ్య‌న్న‌పాత్రుడి కుటుంబానికి అందించారు.

కూల్చివేత‌ల స‌మ‌యంలోనే ఇంట్లోనే ఉన్న అయ్య‌న్న‌పాత్రుడి చిన్న‌కుమారుడు చింత‌కాయ‌ల రాజేష్ ఈ కూల్చివేత‌ల‌ను అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఆయ‌న‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్ల‌వారుజామునే త‌మ ఇంటికి క‌రెంట్ తీసివేశార‌ని రాజేష్ ఆరోపిస్తున్నారు. బుల్డోజ‌ర్లు తీసుకొచ్చి త‌మ ఇంటిని కూలుస్తున్నార‌ని మండిప‌డ్డారు. మ‌రోవైపు చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడి భార్య ప‌ద్మావ‌తి కూడా పోలీసులు, అధికారుల‌పై మండిప‌డ్డారు. త‌మ‌కు జీవించే హ‌క్కు లేదా అని నిల‌దీశారు. బీసీల‌ను ప్ర‌భుత్వం వేధిస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రాజ‌కీయాలు ఉంటే మ‌రోలా చూసుకోవాల‌ని ఆస్తులు ధ్వంసం చేయ‌డం ఏమిట‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మ‌రోవైపు ఈ కూల్చివేత‌లు పూర్తికాగానే అయ్య‌న్న‌పాత్రుడిని పోలీసులు అరెస్టు చేసే ఛాన్స్ ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న‌కు పోలీసులు 41ఏ కింద నోటీసు కూడా అంద‌జేశార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో న‌ర్సీప‌ట్నంలో హైటెన్ష‌న్ నెల‌కొంది.

కాగా గ‌త ఎన్నిక‌ల్లో అయ్య‌న్న‌పాత్రుడు న‌ర్సీప‌ట్నం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్ర‌స్తుతం న‌ర్సీప‌ట్నం నుంచి ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ సోదరుడు ఉమాశంక‌ర్ గ‌ణేష్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయ‌న గత ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున గెలుపొందారు.