Begin typing your search above and press return to search.

రెండు సెంట్లే కాదు.. ఇప్పటికి అయ్యన్నపై 12 కేసులట

By:  Tupaki Desk   |   6 Nov 2022 11:30 PM GMT
రెండు సెంట్లే కాదు.. ఇప్పటికి  అయ్యన్నపై 12 కేసులట
X
మాజీ మంత్రిగా.. సీనియర్ రాజకీయ నేత.. టీడీపీ ఫైర్ బ్రాండ్ గా సుపరిచితులైన అయ్యన్న పాత్రుడు గడిచిన రెండు రోజులుగా హెడ్ లైన్స్ కావటం తెలిసిందే. బీసీ నేతగా గుర్తింపు పొందిన ఆయన.. రెండు సెంట్లు (98 గజాలు) ఇరిగేషన్ శాఖ స్థలాన్ని కబ్జా చేసి.. తన ఇంటి ప్రహరిగోడ కట్టారన్న ఆరోపణపై ఆయన్ను అరెస్టు చేయటం తెలిసిందే. నిజానికి ఈ అంశం కోర్టు విచారణలో ఉన్నప్పటికీ.. అర్థరాత్రి దాటిన తర్వాత నర్సీపట్నంలోని ఆయన ఇంటి గోడలు దూకి మరీ భద్రతా అధికారులు అరెస్టు చేసిన వైనంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ ఎపిసోడ్ జగన్ ప్రభుత్వాన్ని భారీగా డ్యామేజ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంటే.. వైసీపీ ప్రభుత్వానికి చెందిన నేతలు.. పార్టీకి చెందిన వారు.. సానుభూతి పరులు మాత్రం రెండు సెంట్లు కబ్జా మాత్రం కబ్జా కాదా? కబ్జా చేయటమే కాదు.. రెండు సెంట్లేగా అంటూ రాగాలు తీస్తారా? అంటూ విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షాలపై విరుచుకుపడటం.. వారిని ఏదోలా టార్గెట్ చేసి.. కేసులు పెట్టి టార్చర్ చేస్తున్నారని.. ఇందులో భాగంగానే అయ్యన్న పాత్రుడి మీదా తాజాగా కేసుల కత్తి కట్టినట్లుగా మండిపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. అయ్యన్నపాత్రుడికి సంబంధించి తాజాగా కొత్త విషయం బయటకు వచ్చింది. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు అయ్యన్న పాత్రుడి మీద ఏకంగా 12 కేసులు నమోదు చేశారని.. అందులో ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీతో పాటు లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. ఆయన ఇంటిపైకి ఇప్పటికి మూడుసార్లు పోలీసుల్ని పంపారని.. ఒక్క కేసులోకూడా అరెస్టు చేయలేకపోవటంతో.. తాజాగా ఎపిసోడ్ లో మాత్రం ఆయన్ను అదుపులోకి తీసుకోవటం.. రిమాండ్ కు కోరగా.. న్యాయస్థానం ఒప్పుకోకపోవటం తెలిసిందే.

ఇంత జరుగుతున్నా.. మిగిలిన టీడీపీ నేతల తీరుకు భిన్నంగా జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే విషయంలో అయ్యన్న ముందుంటారని చెబుతారు. సోషల్ మీడియాలోనూ ఘాటు వ్యాఖ్యలు చేసేందుకు అస్సలు వెనుకాడని ఆయనపై రెండు సెంట్ల స్థలం కబ్జా ఎపిసోడ్ ఆయనకు అనుకూలంగా మారిందని.. ఆయన్ను టార్గెట్ చేసి వేధిస్తున్న భావన సామాన్య ప్రజల్లో కలుగుతోందని చెబుతున్నారు.. ఇందులో నిజం ఎంతన్నది 2024లో జరిగే ఎన్నికల ఫలితాలు మరింత స్పష్టతను ఇస్తాయని చెబుతున్నారు.

ఆయనపై తొలి కేసును 2019 డిసెంబరులో ఇంటిపై వైసీపీ జెండా తొలగించిన వివాదంపై కేసు నమోదు కాగా.. పన్నెండో కేసు మాత్రం ఈ నవంబరు మూడున ఇంటి నిర్మాణానికి సంబంధించి సమర్పించిన ఎన్ వోసీ ఫోర్జరీ గా పేర్కొంటూ అరెస్టు చేశారు. దీనికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కాకుంటే.. ఫోర్జరీ డాక్యుమెంట్ సమర్పించారన్న కారణంగా.. అర్థరాత్రి దాటిన తర్వాత భారీ బలగాలతో ఇంటి గోడల్ని దూకి.. తలుపులు కొట్టి మరీ అరెస్టు చేయటం.. ఆ సందర్భంగా నైట్ డ్రెస్ ను కూడా మార్చుకోనివ్వకుండా.. చెప్పులు కూడా వేసుకోనివ్వకుండా బలవంతంగా పోలీసు వాహనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందంటారా? అన్నదే అసలు ప్రశ్న.