Begin typing your search above and press return to search.

అర్ధరాత్రి అరెస్ట్ తో అమాంతం గ్రాఫ్ పెరిగిందా...?

By:  Tupaki Desk   |   7 Nov 2022 2:30 AM GMT
అర్ధరాత్రి అరెస్ట్ తో  అమాంతం గ్రాఫ్ పెరిగిందా...?
X
ఆయన ఏడు పదుల వయసులో ఉన్న సీనియర్ నేత. ఒక విధంగా టీడీపీలో చూస్తే అధినేత చంద్రబాబు కంటే సీనియర్ నేత. ఆయన పట్టుమని పాతికేళ్ల వయసులో ఉన్నపుడే టీడీపీ ద్వారా ఎమ్మెల్యే అయ్యారు. రాజకీయాలలో ఈ రోజుకీ ఆ మొండితనాన్ని పైలా పచ్చీస్ గుణాన్ని చూపించే ఆయనే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఆయన ఉత్తరాంధ్రా మొత్తం మీద టీడీపీని ఒక కాపు కాస్తూంటారు. ఆయనకు ప్రత్యర్ధులు అంటే భయమన్నది తెలియదు. ఉన్నది ఉన్నట్లుగా కుండబద్ధలు కొట్టేస్తారు.

ఇక ఏపీలో సీఎం జగన్ని వ్యతిగతంగా టార్గెట్ చేసి ఘాటైన విమర్శలు చేసేది అయ్యన్నే. అందుకే ఆయన మీద వైసీపీ ఫోకస్ పెట్టింది. ఆయనను ఎలాగైనా అరెస్ట్ చేయాలనుకుంది. పన్నెండుకు పైగా కేసులు కూడా ఆయన మీద ఉన్నాయి. దాంతో ఏదో ఒక కేసులో అరెస్ట్ చేయకపోతామా అనుకుంటే ఆయన ఎక్కడా దొరకడంలేదు. దాంతో ఇక లాభం లేదు అనుకుని అర్ధరాత్రి సమయాన్ని ఎందుకుని అయ్యన్న ఇంటికి వెళ్ళిన సీఐడీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.

అయితే ఆ ఆనందం ఎక్కువ సేపు అయితే వైసీపీకి మిగలలేదు. అయ్యన్నను రిమాండులోకి తీసుకోకుండానే జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చేసింది. దాంతో అయ్యన్న టీడీపీకి సూపర్ హీరో అయిపోయారు. ఆయన జగన్ ఎన్ని సార్లు అరెస్ట్ చెసినా తాను లొంగేది లేదని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. తాను ఎక్కడా తగ్గనని, తన సత్తా చూపిస్తాను అని కూడా సవాల్ చేసి మరీ నర్శీపట్నం వచ్చారు.

ఆయనకు ఘన స్వగతాలతో పాటు, మొత్తం నియోజకవర్గం అంతా నీరాజనం పట్టింది. ఇక ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన కీలక నాయకులు అంతా వరసబెట్టి అయ్యన్న ఇంటికి క్యూ కడుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తాజాగా అయ్యన్న ఇంటికి వెళ్ళి ఆయన్ని పరామర్శించారు. మూడు జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ప్రముఖ టీడీపీ నాయకులు కూడా అయ్యన్నకు సంఘీభావం ప్రకటిస్తున్నారు.

ఇంకో వైపు చూస్తే రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగు తమ్ముళ్ళు రోజుకు వంద మందికి తక్కువ కాకుండా అయ్యన్న ఇంటిని వెతుక్కుని మరీ వచ్చి పరామర్శిస్తున్నారు. దీంతో నర్శీపట్నం లో జాతరగా మారిపోయింది. తమ్ముళ్ళు అయితే మా సార్ గ్రాఫ్ సూపర్ లెవెల్ లో పెరిగింది ఈసారి అబ్బాయ్ ఎంపీ మా సార్ ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని అపుడే జోస్యం చెప్పేస్తున్నారు. మొత్తానికి చూస్తే అర్ధరాత్రి అరెస్టుతో అపకీర్తిని వైసీపీ తెచ్చుకుంటే అయ్యన్న గ్రాఫ్ ని బాగా లేపి మరీ గెలుపు దిశగా నడిపించారు అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.