Begin typing your search above and press return to search.

అసంతృప్తి, అభద్రతలో ఏపీ టీడీపీ ఇన్‌ చార్జీలు

By:  Tupaki Desk   |   13 April 2016 4:39 AM GMT
అసంతృప్తి, అభద్రతలో ఏపీ టీడీపీ ఇన్‌ చార్జీలు
X
రాజకీయ పార్టీని బలోపేతం చేసుకోవడం అంటే.. ఇత పార్టీల నుంచి కొత్త నాయకులను ఆహ్వానించి తమలో కలుపుకోవడం మాత్రమే కాదు. ప్రస్తుతం తమ పార్టీనే నమ్ముకుని తమతో ఉన్నవారిని కాపాడుకోవడం కూడా!

ఈ సత్యాన్ని తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం విస్మరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనుంచి ఏ ఎమ్మెల్యే అయినా.. తెదేపాలో చేరడానికి అనుకూల సంకేతం ఇస్తే చాలు ఎగబడి ఆహ్వానించి తమలో కలుపుకోవాలని వారు అత్యుత్సాహపడిపోతున్నారు. ఇలాంటి నిర్ణయాల వెనుక తెదేపా వారి ప్రాథమిక వ్యూహం వైకాపాను దెబ్బతీయడమే తప్ప.. మరొకటి కాదని పలువురు అంటున్నారు. అయితే ఇలాంటి అవకాశవాద చేరికలు వైకాపా ఎమ్మెల్యేలు వస్తున్న చోట్ల పార్టీ ఇన్ చార్జులుగా ఉన్న వారిలో తీవ్రమైన అసంతృప్తిని అభద్రతను కలిగిస్తూ ఉన్నాయి.

తొలినుంచి తెలుగుదేశాన్ని నమ్ముకుని, పార్టీ జెండా మోసిన తమ నెత్తిన ఇవాళ వైకాపా ఎమ్మెల్యేలను తెచ్చి కూర్చోబెడతారా అంటూ పార్టీ శ్రేణులు నాయకుల్ని నేరుగానే ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని పనిచేసినందుకు తమ భవిష్యత్తు ఏంటంటూ ఆందోళన చెందుతున్నారు. వైకాపా ఎమ్మెల్యేలు ఇంకా ఫిరాయించే అవకాశం ఉన్న నియోజకవర్గాలనుంచి కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి వచ్చి తమలోని భయాన్ని వెల్లడిస్తోంటే నేతలు అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది.

ఎంత మంది వైకాపా ఎమ్మెల్యేలు వచ్చినా సరే.. పార్టీలో చేర్చుకోవడం గ్యారంటీ. అందులో సందేహం లేదు. మీకు కూడా తగిన అవకాశాలు ఉండేలా చూసుకుంటాం.. అంతే తప్ప.. వారిని రానివ్వద్దు అంటే కుదర్దు అంటూ తెగేసి చెప్పేస్తున్నారట. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తులు - అలకలు - అభద్రత విపరీతంగా పెరుగుతున్నాయని పలువురు చెబుతున్నారు.