Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో గుంటూరు టీడీపీ కార్యకర్తలు.. హైడ్రామా

By:  Tupaki Desk   |   3 Dec 2018 7:11 AM GMT
హైదరాబాద్ లో గుంటూరు టీడీపీ కార్యకర్తలు.. హైడ్రామా
X
పోలింగ్ కు ఇంకా నాలుగు రోజుల సమయం ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్ని సిద్ధమయ్యాయి.. వారిని ప్రలోభాలకు గురిచేసేలా లక్షల డబ్బులు చేతులు మారుతున్నాయి. తాజాగా టీడీపీ సానుభూతి పరులు హైదరాబాద్ లో డబ్బుల సంచులతో బయటపడడం కలకలం రేపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణపై డబ్బులు వెదజల్లుతున్నాడన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది.

హైదరాబాద్ లోని అమీర్ పేటలో ఆదివారం అర్ధరాత్రి టెన్షన్ వాతావరణం నెలకొంది. అపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సనత్ నగర్ నియోజకవర్గంలో గుంటూరుకు చెందిన టీడీపీ కార్యకర్తలు నగదుతో పోలీసులకు పట్టుబడటం సంచలనంగా మారింది.

సనత్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో డబ్బులు పంచుతున్నారని టీఆర్ ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడమే కాకుండా ఎన్నికల ఫండింగ్ కూడా ఆయనే సమకూరుస్తున్నాడని మండిపడుతున్నారు. ఎలాగైనా టీఆర్ ఎస్ ను ఓడించాలనే లక్ష్యంతో చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని టీఆర్ ఎస్ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.

టీఆర్ ఎస్ నేతల ఆందోళనతో రంగంలోకి దిగిన పోలీసులు గుంటూరుకు చెందిన టీడీపీ కార్యకర్తలు బసచేసిన లాడ్జీలో సోదాలు చేశారు. మరోవైపు ఎలక్షన్ ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు కూడా సోదాలు నిర్వహించారు. నలుగురిని అదుపులోకి తీసుకొని రెండు కార్లతోపాటు 4లక్షల 74వేల రూపాయలు స్వాధీనం చేసున్నారు. కాగా డబ్బులు పంచుతున్నట్లు సరైన ఆధారాలు లభించలేదని - డబ్బుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించకపోవడంతో నగదు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

అదేవిధంగా శేర్ లింగంపల్లిలో ఓటర్లకు పంచేందుకు డబ్బులు తీసుకెళుతున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అలర్టయ్యారు. టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద ప్రసాద్ కుమారుడి కారులో 70లక్షల రూపాయలు పట్టుబడినట్టు సమాచారం. ఆ డబ్బును సీజ్ చేసిన పోలీసులు.. భవ్య సిమెంట్ డైరెక్టర్ శివకుమార్ - కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో టీడీపీ నేతల నుంచి డబ్బులు పట్టుబడటం.. ఇదంతా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడని.. తెలంగాణలో చంద్రబాబు జోక్యం ఏంటని టీఆర్ ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.