Begin typing your search above and press return to search.

బాబు చేసిన ప‌నికి త‌మ్ముళ్లు షాక్!!

By:  Tupaki Desk   |   25 Feb 2017 10:51 AM GMT
బాబు చేసిన ప‌నికి త‌మ్ముళ్లు షాక్!!
X
తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై ఒకింత కోపంతో ఉన్నారు. ఎందుకంటే...ఉత్తరాంధ్ర పట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తెలుగు తమ్ముళ్లకు విషమపరీక్ష పెట్టినందుకు. అదెలా? ఎన్నిక‌లంటే ఎవరికైనా ప‌రీక్ష‌నే క‌దా అంటే....త‌మ్ముళ్ల స్థానం ఎన్నిక‌ల గురించి కాదు! ఎమ్మెల్సీ స్థానాన్ని మిత్రపక్షమైన బీజేపీకి కేటాయించి అభ్యర్థి విజయానికి కలిసి పనిచేయాలంటూ అధిష్టానం ఆదేశించినందుకు.అంతేకాదు దీనికి సంబంధించి ఇరు పార్టీల నేతలతో సమన్వయ కమిటీకి రూపకల్పన చేయ‌డం కూడా త‌మ్ముళ్ల అస‌హ‌నానికి కార‌ణం. ఎందుకు టీడీపీ నేత‌ల‌కు ఇంత ఆందోళ‌న అంటే....దానికి ఎన్నో కార‌ణాలు ఉన్నాయి మ‌రి.

2014లో జ‌రిగిన సాధారణ ఎన్నికల అనంతరం తొలిసారిగా ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న టీడీపీ-బీజేపీ నేత‌లు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో అయోమయంలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేయగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరిద్దరికీ మద్దతుగా ప్రచారం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, వెనుకబడిన ఉత్తరాంధ్రకు మరింత మెరుగైన ప్యాకేజీ వంటి అంశాలతో విస్తృత ప్రచారం చేశారు. ఉత్తరాంధ్రకు సంబంధించి ఐదు పార్లమెంట్ స్థానాల్లో నాలుగింటిని, 34 అసెంబ్లీ స్థానాల్లో 25 సెగ్మెంట్లను మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీ గెలుచుకున్నాయి. విపక్షం ఒక ఎంపీ స్థానంతో పాటు తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లకే పరిమితమైంది. విభజనతో జరిగిన అన్యాయం సరిదిద్దాలంటే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడపాలంటే టీడీపీలకే సాధ్యమని ప్రజలు విశ్వసించారు. దీంతో ఈ రెండు పార్టీల‌కే ప్రజలు పట్టం కట్టారు. ఎన్నికలు జరిగి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాలు ఏర్పాటై మూడేళ్లు కావస్తోంది. అయితే జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు మినహా ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ప్యాకేజీ వంటి అంశాలు హామీలుగానే మిగిలి పోయాయి. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించగా, గత్యంతరం లేని పరిస్థితుల్లో టిడిపి అంగీకరించింది. కేంద్ర నిర్ణయంతో ప్రత్యేక హోదా ఉద్యమానికి ఆజ్యం పోసినట్టైంది. ఇక విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ విషయంలోనూ కేంద్రం ఇప్పటికీ నాన్పుడుధోరణినే అనుసరిస్తోంది. రైల్వే శాఖను నిర్వహిస్తున్న సురేష్ ప్రభును రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపిక చేసినప్పటికీ జోన్ సహా పలు అంశాల్లో రాష్ట్రానికి ఒరిగిందంటూ ఏమీ లేదు. విశాఖకు రైల్వే జోన్ ప్రకటించే విషయంలో కొన్ని సాంకేతికాంశాలను సాకుగా చూపుతూ కేంద్రం ప్రకటన వాయిదా వేస్తూ వస్తోంది. ప్యాకేజీ ద్వారా 24వేల కోట్ల మేర ఆర్థిక సాయం అందుతుందని భావించిన వెనుకబడిన జిల్లాలకు కూడా నిరాశే ఎదురైంది. కేవలం రూ.1000కోట్లతో సరిపెట్టేశారు.

ఇలాంటి పరిస్థితుల నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ ఈ అంశాల్లో బీజేపీ - టీడీపీల వైఫ‌ల్యాల‌పై ఇప్ప‌టికే విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ప్రజల మద్దతు కూడగట్టే విషయంలో విపక్షాలతో పాటు అప్పట్లో టీడీపీ - బీజేపీ ల తరపున ప్రచారం చేసిన జనసేన కూడా ఉద్యమానికి సన్నద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర పట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేస్తున్న మిత్రపక్ష బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు టీడీపీ వర్గాలు సాహసించలేకపోతున్నాయి. సామాన్య జనానికైతే ఏదో చెప్పి ఓట్లేయించుకోగలం కానీ, చదువుకున్న మేథావులకు ప్రత్యేక హోదా, రైల్వే జోన్, అభివృద్ధి ప్యాకేజీ వంటి అంశాల్లో వైఫల్యాలను ఏ విధంగా నచ్చచెప్పగలమని తమ్ముళ్లు వాపోతున్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలను బాధ్యులు చేయగా పార్టీ తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ ప్రచార బాధ్య‌త‌ల‌ను కింది స్థాయి కేడర్‌ పై బాధ్యతలు పెట్టి తప్పించుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/