Begin typing your search above and press return to search.

తీవ్ర నిస్తేజం.. చంద్రబాబు సొంత జిల్లాలో!

By:  Tupaki Desk   |   2 July 2019 7:25 AM GMT
తీవ్ర  నిస్తేజం.. చంద్రబాబు సొంత జిల్లాలో!
X
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఆ పార్టీ తీవ్ర నిస్తేజంలో కూరుకుపోయిందని తెలుస్తోంది. అక్కడ నేతలు ఎవ్వరూ పార్టీ సానుభూతి పరులకు - కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదట. ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి నేతలు పూర్తిగా మొహం చాటేశారని సమాచారం.

చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్నడూ ఎదుర్కొనని స్థాయి పరాజయాన్ని పొందిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ తరఫున ఆ జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు ఒక్కరూ మాత్రమే నెగ్గారు. పద్నాలుగు ఎమ్మెల్యే సీట్లున్న ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడింది.

జిల్లాల్లో చంద్రబాబు నాయుడు తప్ప మరొక్క ఎమ్మెల్యే కూడా నెగ్గకపోవడంతో.. అక్కడ కార్యకర్తలను పలకరించే నేతే లేకుండా పోయారు. ఓడిన వారంతా బయటకు కూడా రావడం లేదని వార్తలు వస్తూ ఉన్నాయి.

నెల రోజులు గడిచిపోయినా నేతలు ఇంకా బయటకు రాకపోవడం - కార్యకర్తలను పలకరించకపోవడం చర్చనీయాంశంగా మారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో గెలుపోటములు సహజం మొహం చాటేస్తే జనాలు మరిచిపోతారనే విషయాన్ని ఆ పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని పరిశీలకులు అంటున్నారు.

చంద్రబాబు నెగ్గారు కానీ - ఆయన నియోజకవర్గం వైపు - జిల్లా వైపు చూడటం లేదు. పలు చోట్ల ప్రతీకార దాడులు కూడా జరిగాయి. అలాంటి వారు ఇప్పుడు మరింత ఇబ్బంది పడుతూ ఉన్నారట. తమకు నేతల నుంచి కనీస పరామర్శ కూడా లేదని వారు బాధపడుతూ ఉన్నారట.

తెలుగుదేశం పార్టీలో ఓటమి తర్వాత ఇలాంటి నిస్తేజ స్థితి కనిపిస్తూ ఉందని ఆ పార్టీ వాళ్లే వాపోతూ ఉన్నారు. మరేదైనా జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉంటే అదో ఎత్తు అని, స్వయంగా చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనే అలాంటి పరిస్థితి తలెత్తడం మాత్రం గమనార్హమని పరిశీలకులు కూడా అంటున్నారు.