Begin typing your search above and press return to search.

క్విట్ కోడెల....సేవ్ సత్తెనపల్లి...

By:  Tupaki Desk   |   8 Aug 2019 5:56 AM GMT
క్విట్ కోడెల....సేవ్ సత్తెనపల్లి...
X
క్విట్ కోడెల....సేవ్ సత్తెనపల్లి. ఇది సత్తెనపల్లి ప్రజల నినాదమే కాదు.. నియోజకవర్గ టీడీపీ నేతల నినాదం కూడా....గత అయిదేళ్లుగా టీడీపీ నేత - మాజీ స్పెకర్ కోడెల శివప్రసాద్ కుటుంబం చేసిన అరాచకాలని తట్టుకోలేని ప్రజలు - టీడీపీ నేతలు...కోడెల కుటుంబాన్ని నియోజకవర్గం నుంచి పంపేయాలని చూస్తున్నారు. టీడీపీ నేతలు...నియోజకవర్గానికి కొత్త ఇన్ చార్జ్ ని నియమించాలని అధినేత వద్ద మొర పెట్టుకుంటున్నారు. కాగా, 2014 లో సత్తెనపల్లి నుంచి గెలిచిన కోడెల శివప్రసాద్ నవ్యాంధ్ర మొదటి స్పీకర్ గా ఎన్నికయ్యాడు.

అయితే తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని కోడెల కుమారుడు శివరామప్రసాద్ - కుమార్తె పూనాటి విజయలక్ష్మి చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. భూ దందాలు - కె ట్యాక్స్ పేరిట జనం వద్ద డబ్బులు వసూలు చేయడం... ఇలా చాలానే కోడెల కుటుంబం నియోజకవర్గ ప్రజలని ముప్పుతిప్పలు పెట్టారు. అయితే స్పీకర్ గా ఉన్న కోడెల కుటుంబం చేస్తున్న అరాచకాలకి అడ్డుకట్ట వేయలేకపోయారు.

అయితే కుటుంబం చేసిన అరాచకాలతో భారీ వ్యతిరేకితని మూటగట్టుకున్న....కోడెల తాజా ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి దారుణంగా ఓడిపోయారు. ఇక రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలోని కోడెల బాధితులు ఒక్కొక్కరుగా బయటకొచ్చి కోడెల కుమారుడు - కుమార్తెలపై కేసులు పెడుతున్నారు. ప్రస్తుతం అవి విచారణలో ఉన్నాయి. ఒకవైపు ప్రజలు కేసులు పెడుతుంటే - మరోవైపు సొంత పార్టీ నేతలు కూడా కోడెల వద్దు అని ఆందోళనలు చేస్తున్నారు.

అంతకముందు ఐదు పర్యాయాలు నరసారావుపేట నుంచి గెలిచిన ఆయన అక్కడ వ్యతిరేకిత రావడంతో 2014లో సత్తెనపల్లి వచ్చి పోటీ చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ నేతలు కూడా కోడెల వద్దు అంటున్నారు. ఆయనకి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ప్లకార్డులు పట్టుకుని నిరసనలు కూడా చేస్తున్నారు. అలాగే త్వరగా కోడెలని మార్చేసి నియోజకవర్గానికి కొత్త ఇన్ చార్జ్ ని నియమించాలని అధినేత చంద్రబాబుని కొరేందుకు 200 మందికిపైగా అసమ్మతి నాయకులు - కార్యకర్తలు గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్లారు.

ఇక అక్కడే క్విట్‌ కోడెల.. సేవ్‌ సత్తెనపల్లి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. కొత్త ఇన్‌ చార్జిని నియమించేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆ సమయంలో పార్టీ చంద్రబాబుతోపాటు కోడెల శివప్రసాదరావు సైతం కార్యాలయంలోనే ఉండడం గమనార్హం. అయితే చివరికి చంద్రబాబు కార్యాలయం నుంచి వెళ్లిపోయే సమయంలో కాన్వాయ్‌ వద్ద అసమ్మతి నాయకులు ఆయన్ను కలవగా.. ‘నాకు అన్నీ తెలుసు. నేను చూసుకుంటా’ అంటూ వెళ్లిపోయారు. మరి చంద్రబాబు కోడెల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏదేమైనా టీడీపీలో కోడెల రాజ‌కీయ ప్ర‌స్థానం ముగిసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది.