Begin typing your search above and press return to search.

రోజా అరెస్టుపై త‌మ్ముళ్లు హ‌ర్ట్ అవుతున్నారు

By:  Tupaki Desk   |   12 Feb 2017 7:54 AM GMT
రోజా అరెస్టుపై త‌మ్ముళ్లు హ‌ర్ట్ అవుతున్నారు
X
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి అరెస్టు చేసిన వైనం తెలుగుదేశం పార్టీ శ్రేణులెవరికీ రుచించలేదంటున్నారు. విమానం దిగీ దిగ‌క‌ముందే అన్న‌ట్లుగా గన్నవరం ఎయిర్‌పోర్టులోనే అడ్డుకుని, ఎంతో ఉత్కంఠ‌ను సృష్టించిన అనంత‌రం హైదరాబాద్‌కు తరలించిన వైనం పార్టీకి చెడ్డపేరు తెచ్చిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో నెలకొంది. ఈ ఎపిసోడ్‌తో ఒక మహిళను అనవసరంగా అవమానించి అరెస్టు చేశారన్న సానుభూతిని తామే వైసీపీకి అందించామని పలువురు సీనియర్లు వ్యాఖ్యానిస్తుండ‌టం గ‌మ‌నార్హం. రోజా అరెస్టుకు కారణాలు చూపించడంలో తాము విఫలమైతే, దానిని అక్రమమని చాటడంలో వైసీపీ విజయం సాధించిందని, ఈ ఎపిసోడ్‌లో వైసీపీకి పొలిటికల్ మైలేజీ వచ్చిందంటున్నారు. మహిళా సదస్సు సందర్భంలో మహిళా ఎమ్మెల్యేను సదస్సు వరకూ రానీయకుండా అడ్డుకున్నారన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొందని, ఇది ప్రమాదకర సంకేతమని వ్యాఖ్యానిస్తున్నారు. ఆమెను సదస్సు వరకూ రానిచ్చి, వేదికపైకి పిలవకుండా సరిపోయేదని పలువురు సీనియర్లు అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఆమెను వేదికపైకి ఆహ్వానించకపోయినా ఎలాంటి విమర్శలు వచ్చేవి కాదని, తొలిరోజు సభలో వైసీపీ ఎంపీ బుట్టా రేణుకకు అవకాశం ఇచ్చినందున రోజా విమర్శలు సరికావన్న అభిప్రాయం వ్యక్తమయ్యేదని విశ్లేషిస్తున్నారు.

ఓ పక్క మహిళల గురించి మాట్లాడుతూ, అదే మహిళను అనవసరంగా అరెస్టు చేశారన్న భావన కల్పించారన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రోజా సదస్సుకు వచ్చినా ఆమె దానిని రాజకీయం చేస్తారనడంలో సందేహం లేదు. కానీ త‌ద్వారా ఆమె వ్య‌క్తిగ‌తం ఇబ్బందులు ప‌డి ఉండేదని, అడ్డుకోవ‌డం ద్వారా తాము ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంద‌ని పార్టీ నేత‌లు అంటున్నారు. రోజాపై మహిళా ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులను ఉసిగొల్పి ఆమెకు అనవసర ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలే సమస్యలతో సతమవుతున్న నేపథ్యంలో అనవసరమైన సమస్యలు కొనితెచ్చుకుని అదనపు సమస్యల్లో ఇరుక్కుంటున్న తీరుపై తెలుగుదేశం పార్టీ సీనియర్లు, మంత్రులు తలపట్టుకుంటున్నారు. ఈ విషయంలో పార్టీ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కీలకమైన అంశాలు, పార్టీ ప్రతిష్ఠతో ముడిపడిన వ్యవహారాలు తెరపైకి వచ్చినప్పుడు తమతో మాట్లాడకపోవడంపై సీనియర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ విషయంలో బాబు విపక్షనేతగా ఒకతీరు, సీఎంగా మరో తీరున వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి రోజా అరెస్టు, హైదరాబాద్ తరలింపు అంశాన్ని నాయకత్వం తమతో చర్చించలేదని చెబుతున్నారు.