Begin typing your search above and press return to search.

జనవరి 21 నుండి టీడీపీ ప్రచారం

By:  Tupaki Desk   |   17 Jan 2021 6:30 AM GMT
జనవరి 21 నుండి టీడీపీ ప్రచారం
X
తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ప్రచారంలోకి టీడీపీ దూకబోతోంది. ఈ నెల 21వ తేదీనుండి అభ్యర్ధి పనబాక లక్ష్మి తన ప్రచారాన్ని ప్రారంభించబోతున్నట్లు చంద్రబాబునాయుడు చెప్పారు. పార్టీ నేతలతో జరిగిన జూమ్ కాన్ఫరెన్సులో మాట్లాడారు. జనవరి 21వ తేదీనుండి పార్టీ అభ్యర్ధి ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నట్లు చెప్పారు. పదిరోజుల పాటు లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని 700 గ్రామాల్లో ఒకేసారి ఉదృతంగా ప్రచారం చేయాలని నేతలను చంద్రబాబు ఆదేశించారు.

టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాల అములును ప్రధానంగా జనాలకు వివరించాలని చంద్రబాబు గట్టిగా చెప్పారు. ఇదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న విద్వంసాలను, పన్నులమోతను, అప్పుల భారాన్ని జనాలకు వివరించాలని గట్టిగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి ఎర్రచందనం స్మగ్లింగ్ మళ్ళీ పెరిగిపోయిందంటు ఆరోపించారు. గంధపుచెక్కల వ్యాపారం కూడా మొదలైపోయిందని మండిపోయారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో చిత్తూరు జిల్లాలో అరాచకం ఏస్ధాయిలో పెరిగిపోయిందో జనాలకు వివరించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. మొత్తానికి తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నట్లు అర్ధమవుతోంది. అయితే అందుకు క్షేత్రస్ధాయి పరిస్ధితులు సహకరిస్తాయా అన్నదే అనుమానంగా ఉంది. ఎందుకంటే తిరుపతి లోక్ సభ పరిధిలో టీడీపీకి గట్టి నేతలే లేరన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి ఎన్నికకు ఓ నేతను రంగంలోకి దింపటం వల్ల పార్టీ పూర్తిగా బలహీనపడిపోయింది.

ఇటువంటి పరిస్ధితుల్లో పనబాక లక్ష్మిని చంద్రబాబు రెండోసారి అభ్యర్ధిగా రంగంలోకి దింపుతున్నారు. మరి ఈమె ప్రభావం పార్టీ నేతలపైనా, జనాలపైన ఏమేరకు ఉంటుందన్నది వెయిట్ చేసి చూడాల్సిందే. నేతలు ఎవరితోను మాట్లాడకుండానే చంద్రబాబు అభ్యర్ధిగా పనబాకను డిసైడ్ చేసి ప్రకటించేశారు. ఈ విషయంలో కొందరు నేతల్లో అసంతృప్తిగా ఉన్నా చేయగలిగేది ఏమీ లేదు కాబట్టి మౌనంగా ఉండిపోయారు. దానికితోడు జనవరి 6వ తేదీ తర్వాత ప్రచారంలోకి దిగుతానని చెప్పిన పనబాక కూడా దిగలేదు. తాజాగా 21 నుండి ప్రచారం మొదలవుతోందని స్వయంగా చంద్రబబే చెప్పారు కాబట్టి అందరు యాక్టివ్ అవుతారేమో చూడాలి.