Begin typing your search above and press return to search.

జగన్ ను గెలిపించేవి ఆ 2 పథకాలే.. ఔత్సాహిక టీడీపీ అభ్యర్థి

By:  Tupaki Desk   |   10 Jan 2023 10:44 AM GMT
జగన్ ను గెలిపించేవి ఆ 2 పథకాలే.. ఔత్సాహిక టీడీపీ అభ్యర్థి
X
ఏపీలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు మహా జోరుగా సాగనున్నాయి. టీడీపీ-జన సేన పొత్తు ఖాయమనే సంకేతాలు ఓవైపు.. బీజేపీ దారి ఏమిటో తేలని వైనం మరోవైపు.. వై నాట్ 175 అంటూ వైసీపీ ఇంకోవైపు.. ఇదంతా ఎవరికి వారి ప్రయత్నంగా సర్దిచెప్పుకొంటూనే తటస్థులుగా ఆలోచించాల్సిన సమయం కూడా వచ్చేసింది. మహా అంటే.. ఏడాది వ్యవధిలో ఎన్నికలు ఉండడమే అందుకు కారణం. దీంతోనే అధికార, ప్రతిపక్ష రాజకీయాలు వేడందుకున్నాయి.

ఆ ఔత్సాహిక అభ్యర్థి విశ్లేషణ ఇది..

‘‘ఏపీలో అధికార వైసీపీపై వ్యతిరేకత బాగా ఉంది..’’ ఓ వర్గం మీడియా లేదా కొందరి మాట. వాస్తవానికి చూస్తే.. ఎటూ తేలని మూడు రాజధానులు, గుంతలు తప్ప అతీ గతి లేని రోడ్లు, అధికార దౌర్జన్యం, పరిశ్రమలు, సంస్థల ఏర్పాటులో రాష్ట్ర ప్రగతి తదితర విషయాలను బేరీజు వేసుకుంటే బయటినుంచి చూసేవారికి ఈ సంగతి నిజమేనని అనిపిస్తుంది. కానీ, ఉత్తరాంధ్రకు చెందిన ఔత్సాహిక టీడీపీ అభ్యర్థి విశ్లేషణ మరోలా ఉంది.

జగన్ కు ఈ 2 చాలు.. 2 ప్రతిపక్షాలు ఒకటవ్వాలి

టీడీపీ తరఫున ఉత్తరాంధ్రలోని ఓ కీలక నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్న ఆ అభ్యర్థి ఇటీవల మీడియా పెద్దను కలిశారు. ఆ సందర్భంగా తమ రాష్ట్రంలోని పరిస్థితిని వివరించారు. అయితే, దీనిలోని అంశాలను చూస్తే మరోసారి వైసీపీ గెలుపు ఖాయం అనేలా ఆయన లెక్కలేశారు. కానీ, టీడీపీ-జనసేన కలిసి గట్టిగా పోరాడితే ఇప్పటికీ అవకాశాలున్నాయనేది ఆయన అంచనా.

ఇక ఆ ఔత్సాహిక అభ్యర్థి చెప్పినదాని ప్రకారం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామ సచివాలయాలు, పెద్దఎత్తున పంపిణీ చేస్తున్న పింఛన్లు ప్రజల్లో చాలా ఆదరణ పొందాయి. ప్రతి పనికి మండల కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా, కావాల్సిన పత్రాలు ఇంటికే వచ్చేలా ఉన్న వాలంటీర్ల వ్యవస్థతో ప్రజలు సంతోషంగా ఉన్నారు.

మరోవైపు పింఛన్లు ఠంచనుగా పడుతుండడంతో వారికి మరో ఆలోచన లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కారుకు మరోసారి అవకాశం ఇస్తారనే విశ్లేషణ చేశారు. కానీ, వైఫల్యాల విషయంలో ప్రతిపక్షాలు గట్టిగా నిలిస్తే వైసీపీని ఓడించడం ఖాయం అని కూడా చెప్పుకొచ్చారు.