Begin typing your search above and press return to search.

దండిగా విరాళాలు ఇవ్వండంటున్న చంద్రబాబు

By:  Tupaki Desk   |   17 Jun 2022 2:30 PM GMT
దండిగా విరాళాలు ఇవ్వండంటున్న చంద్రబాబు
X
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడానికి పార్టీ కార్యకర్తలంతా భారీగా విరాళాలివ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరుతున్నారు. వచ్చే ఎన్నికల కోసం పెద్ద సెటప్ సిద్దం చేస్తున్నామని.. 25 వేల మంది ఓటర్లను మేనేజ్ చేయగలిగినవారు ఎంతమంది ఉన్నారో వారంతా దండిగా పార్టీ కోసం డబ్బు ఖర్చు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అనకాపల్లి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షపై తాజాగా చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో భాగంగా ఓటర్ల కోసం పది రూపాయలు ఖర్చు చేసి మేనేజ్‌ చేసే వాళ్లని గుర్తించి మ్యాపింగ్‌ చేస్తున్నామని చంద్రబాబు నేతలకు వివరించారు. మీ పరిధిలో మీరు ఎన్ని ఓట్లు సంపాదించగలరు.. దానికోసం ఎంత ఖర్చుచెయ్యగలరు.. ఏం చేస్తారన్న విషయాల్ని తెలుసుకుని బూత్‌కి ఒకరు చొప్పున నియమిస్తామని చెబుతున్నారు.

రాబోయే ఎన్నికలు మన పార్టీకి కీలకమని చంద్రబాబు పార్టీ నేతలకు హితబోధ చేశారు. ఇందుకోసం పార్టీకి భారీ స్థాయిలో విరాళాలివ్వాలి అని కోరారు. పార్టీ కార్యక్రమాలను ఈసారి టెక్నాలజీతో అనుసంధానం చేసి ముందుకు వెళ్తున్నామని వారికి వివరించారు. గూగుల్‌ ట్రాకింగ్‌తో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చంద్రబాబు నేతల దృష్టికి తెచ్చారు.

ఇటీవల మునిసిపాలిటీ ఎన్నికల్లో కుప్పంలో వెనకబడ్డామని.. అందుకే తానే స్వయంగా రంగంలోకి చంద్రబాబు పార్టీ నేతలకు తెలిపారు. వర్చువల్‌గా మీటింగ్‌లు పెట్టడంతో ప్రస్తుతం 35 వేలమంది సభ్యులు టీడీపీలో చేరడంతో కుప్పంలో మెరుగయ్యామని వివరించారు.

టీడీపీ సభ్యత్వం విషయంలో మంగళగిరి మొదటిస్థానంలో ఉండగా దీన్ని అధిగమిస్తుందని చంద్రబాబు నేతలకు వివరించారు. అలాగే వైఎస్సార్సీపీ నేతల బెదిరింపులకు గురవుతున్న కార్యకర్తల ఇంటిముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పార్టీ ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు.

కాగా చంద్రబాబు నియోజకవర్గాల సమీక్ష సందర్భంగా అనకాపల్లిలో వర్గపోరు బహిర్గతమైంది. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీష్‌ వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం. సమీక్ష సమయంలో చంద్రబాబుతో పాటు వేదికపై ఎవరెవరు ఉండాలన్న అంశంపై ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగిందని తెలుస్తోంది.

తమ వర్గం వారుండాలంటే.. తమ వర్గం వారికి ప్రాధాన్యమివ్వాలంటూ పీలా, బుద్ధా వర్గీయులు వాదులాడుకున్నారట. పార్టీ సీనియర్‌ నేత నిమ్మకాలయ చినరాజప్ప వచ్చి వివాదాన్ని సద్దుమణిగించారని తెలుస్తోంది.