Begin typing your search above and press return to search.

లెక్కలు సరిచేస్తామంటున్న చంద్రబాబు

By:  Tupaki Desk   |   7 Jan 2023 2:30 AM GMT
లెక్కలు సరిచేస్తామంటున్న చంద్రబాబు
X
తెలుగుదేశం అధినేతకు కసి ఎక్కువ. వయసును కూడా పక్కన పెట్టి ఆయన దూకుడు చేస్తారు. తన రాజకీయ జీవితంలో ఎంతో మంది సీఎం లను చూసిన చంద్రబాబుకు జగన్ ఒక కొరకరాని కొయ్య లాంటి సీఎం. అందుకే ఆయన తరచూ అంటూంటారు ఇలాంటి సీఎం ని తాను ఎపుడూ చూడలేదని. జగన్ని సైకో అని ఉన్మాది అని ఇప్పటిదాకా విమర్శించిన చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం టూర్ లో మాత్రం ఇంకా పరుష పదజాలం ఉపయోగించేశారు.

పట్టాదారు పాసు పుస్తకాల మీద అసహ్యమైన జగన్ బొమ్మ ఎందుకు ఉండాలని నిలదీశారు. దరిద్రుల బొమ్మలను మనం చూడాలా అంటూ జగన్ మీద డైరెక్ట్ అటాక్ చేశారు. అందరి లెక్కలూ సరిచేస్తాను వచ్చేది మనమే అంటూ సొంత గడ్డ నుంచే ఆయన ఏపీకి సంకేతం ఇచ్చారు. జగన్ని ఫెయిల్యూర్ సీఎం అన్నారు, ఒక్క చాన్స్ తో అధికారంలోకి వచ్చి నాలుగు దశాబ్దాల వెనక్కి ఏపీని నెట్టిన జగన్ కి మళ్ళీ అధికారం జనాలు ఇస్తారనుకుంటే అది కలగానే మిగులుతుంది అని జోస్యం చెప్పారు బాబు.

ఏపీలో జగన్ మళ్ళీ సీఎం కాడు ఇది నేను చెబుతున్న మాట అని చంద్రబాబు రీ సౌండ్ చేశారు. ఈ సైకో సీఎం ని నమ్ముకుంటే మీకూ ఇబ్బందే అంటూ పోలీసులను ఆయన హెచ్చరించారు. కుప్పంలో మూడు రోజుల పాటు సాగిన చంద్రబాబు టూర్ అంతా జగన్ మీద నిప్పులు, పోలీసుల మీద విమర్శలతో సాగిపోయింది. ఒక విధంగా బాబు సొంత నియోజకవర్గం పర్యటన కాస్తా జగన్ వర్సెస్ బాబుగా మారింది.

బాబు ప్రచార రధానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన బస్సు ఎక్కి మరీ ఏడున్నర పదుల వయసులో ప్రసగించడం కుప్పంలో సంచలనమే అయింది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని జగన్ ఖూనీ చేస్తున్నారు అని బాబు ఘాటైన విమర్శలు చేయడం మరో విశేషం. కుప్పంలో రోడ్ షోలతో ఎపుడూ సందడి చేసే బాబుకు ఈసారి జగన్ సర్కార్ జీవో నంబర్ 1 తో గట్టి షాక్ ఇచ్చేసింది.

జీవో ఇలా రిలీజ్ అవడమేంటి అలా చంద్రబాబు టూర్ పెట్టుకున్నారు. దాంతో ఈ జీవో వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ బాబు మీదనే పడింది. దాంతో కుప్పం వీధులలో బాబు ఇంటింటికీ తిరుగుతూ జనాలను పలుకరించడం ద్వారా తాను తగ్గేదేలే అని చెప్పేశారు. ఒక దశలో రోడ్డు మీద బైఠాయించిన చంద్రబాబు జగన్ మీద విమర్శలే సంధించరు. పోలీసులను తప్పు చేసిన వారిని విడిచిపెట్టేదే లేదు అని హెచ్చరించారు.

టోటల్ గా చూస్తే బాబు కుప్పం టూర్ వల్ల మైలేజ్ ఎవరికి ఎక్కువగా వచ్చింది అన్నది చూస్తే వైసీపీ బాబుని అడ్డుకుంది అన్న ప్రచారం అయితే జనాల్లోకి ఆయన బలంగా పంపగలిగారు. అదే టైం లో తమ జీవో పవర్ ఏంటో చూపించామని వైసీపీ సర్కార్ పెద్దలు భావించారు కానీ బాబు సభల విషయంలో పటిష్టమైన ఏర్పాట్లు చేసి అలా వదిలేసి ఉంటే బాగుండేది అన్న భావన అయితే ఉంది. బాబు సైతం తనను అడ్డుకోవడం అంటే ప్రజాస్వామ్యం మీద చేసిన దాడిగా అభివర్ణించడం ద్వరా ఏపీలో తటస్థులు, విద్యావంతులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జీవో నంబర్ 1 అమలు మరింతగా సంక్లిష్టంగా మారడమే కాకుండా గట్టిగా అమలు చేయాలని చూస్తే అంతకు మించిన ప్రతిఘటన విపక్షం నుంచి వస్తుంది. జనాలలో వారి మీద సానుభూతిని పెంచుతుంది. మరి అధికార వైసీపీ ఏ ఆలోచనలతో జీవోను తెచ్చిందో కానీ అది బూమరాంగ్ అయ్యేలా ఉందని బాబు కుప్పం టూర్ స్పష్టం చేసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.