Begin typing your search above and press return to search.

లెక్క‌లు మాస్టారిగా చంద్ర‌బాబు !

By:  Tupaki Desk   |   18 Jun 2022 12:30 PM GMT
లెక్క‌లు మాస్టారిగా చంద్ర‌బాబు !
X
విప‌క్ష (వైసీపీ) త‌ప్పొప్పుల చిట్టాప‌ద్దును తాను సిద్ధం చేస్తున్నాన‌ని అంటున్నారు చంద్ర‌బాబు. త‌మ‌ను మనో వ్య‌ధ‌కు గురిచేసిన నాయ‌కులంద‌రినీ తాను గుర్తుపెట్టుకుంటాన‌ని, వేధింపుల‌కు త‌గు స‌మాధానం అధికారం చేప‌ట్టిన వెంట‌నే ఇస్తాన‌ని చెప్పారాయ‌న.ఆ విధంగా అంద‌రి లెక్కా తేలుస్తాన‌ని చెప్ప‌క‌నే చెప్పారు. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో...

ఒక్క‌మాట‌లో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ముందు క‌న్నా యాక్టివ్ అయింది. అందుకు చంద్ర‌బాబే కార‌ణం. కొన్ని విష‌యాల్లో ముందు క‌న్నా వెనుక‌బ‌డిపోతోంది. అందుకు బాబే కార‌ణం. నేత‌ల‌ను కంట్రోల్ చేయ‌డంలో కొంత వెనుక‌బాటుత‌నంతో ఉన్నారాయ‌న అన్న వాద‌న కూడా వినిపిస్తోంది. అందుక‌నో, ఎందుక‌నో ముందున్నంత స్ట్రిక్టుగా ఆయ‌న లేరు అన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఏదేమ‌యిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు చెప్పిన విధంగా పార్టీ శ్రేణులన్నీ ప‌నిచేస్తేనే 2024 అన్న‌ది టీడీపీకి వ‌శం. ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ప్ర‌తి ఇంటి నుంచి పోరాడాల‌ని చంద్ర‌బాబు చెబుతుంటే, ఆ మాట‌ను తెలుగు త‌మ్ముళ్లు ఏ విధంగా అర్థం చేసుకుని నాకేంటి అనుకోకుండా పార్టీ ప‌టిష్ట‌త‌కు ప‌నిచేస్తారో అన్న‌ది కూడా ఇప్పుడిక చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ప‌ద‌వుల కేటాయింపుల‌లో అసంతృప్తి ఉన్న‌వారికి అధినేత భ‌రోసా కొంత‌వ‌ర‌కూ ద‌క్కితే పార్టీ కోసం కార్య‌క‌ర్త‌ల‌లో ఎవ్వ‌రయినా పనిచేసేందుకు సిద్ధమే అయి ఉంటారు.

ఈ నేప‌థ్యాన.. ఈ సంద‌ర్భాన..రానున్న‌కాలంలో అంద‌రి లెక్క‌లూ తేలుస్తాన‌ని, అన్నింటినీ తాను రాసుకుంటున్నాన‌ని తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడొక సంచ‌ల‌నం అవుతోంది. అన‌కాప‌ల్లి కేంద్రంగా నిన్న‌టి వేళ (గురువారం, జూన్ 17,2022) నియోజ‌క‌వ‌ర్గాల ఇంఛార్జుల‌తో రివ్యూ మీటింగ్ నిర్వ‌హించారు. తొలుత ఇక్క‌డి క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి అమ్మవారిని సంద‌ర్శించుకున్నారు. అనంత‌రం ఇక్క‌డి పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ కార్యాల‌యాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ర్యాలీలో చంద్ర‌బాబు భావోద్వేగంతో మాట్లాడారు.

రిట‌న్ గిఫ్టులు ఉంటాయా ?వాస్త‌వానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వ‌ర‌కూ టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై వేధింపుల‌కు పాల్పడుతోంద‌ని విమ‌ర్శ‌లున్నాయి. వీటిపై చంద్ర‌బాబు గ‌తంలోనూ స్పందించారు. పోలీసుల వేధింపుల‌తో పాటు అక్ర‌మ కేసుల బ‌నాయింపు కూడా ఉంద‌ని తెలుగు త‌మ్ముళ్లు వాపోతున్నారు. గ‌తం క‌న్నా భిన్నంగా పోలీసులు గృహ నిర్బంధం పేరిట చుక్కలు చూపిస్తున్నార‌ని, చిన్న, చిన్న నిర‌స‌న‌ల‌కు కూడా అనుమ‌తి ఇవ్వ‌డం లేదని చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ లాంటి నేత‌లూ మండిప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో అధికారంలోకి రాగానే వైసీపీ త‌న త‌రఫున రిట‌న్ గిఫ్టులు త‌ప్ప‌క ఉంటాయ‌ని అంటున్నారీయ‌న.

క్విట్ జ‌గ‌న్ సాధ్య‌మా..ఇదే సంద‌ర్భంలో క్విట్ జ‌గ‌న్..సేవ్ ఆంధ్ర‌ప్రదేశ్ పేరిట అంతా ప‌నిచేయాల‌ని అన్నారు. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌కు తావిస్తోంది. తెలుగుదేశం పార్టీ పూర్తిగా ముందున్నంత వేగంగా ప‌నిచేస్తేనే ఈ నినాదం వ‌ర్కౌట్ అవుతుంది. అయితే అధినేత వ‌ర‌కూ కొంత ఆశ ఉంది. కానీ తెలుగుదేశం నాయ‌కులు ప్ర‌జల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌మవైపు తిప్పుకోకుండా విప‌క్ష పార్టీ నేత‌ల‌ను బూతులు తిట్ట‌డం కూడా స‌బ‌బు కాద‌ని, అయ్య‌న్న లాంటి లీడ‌ర్లు ఈ పాటి భాష మాట్లాడానికేనా ఉన్న‌ది అని కూడా కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. అన‌కాపల్లి ఒక్క‌టే కాదు 15 నియోజ‌క‌వ‌ర్గాలున్న విశాఖ‌ను ఎంద‌రెంద‌రో శాసిస్తున్నారు.

వారిలో అయ్య‌న్న ఒక‌రు. గంటా శ్రీ‌ను పైకి మాట్లాడ‌క‌పోయినా ఉన్నంత‌లో ఎన్నిక‌ల వేళ మాత్ర‌మే కాస్త యాక్టివ్ గా ఉండి., త‌రువాత సైలెంట్ అయిపోతార‌నే వాద‌న కూడా ఉంది. బాబు చెప్పిన విధంగా తెలుగు త‌మ్ముళ్లు ప‌నిచేయాల‌ని అనుకుంటే ముందుగా నాయ‌కత్వ మార్పు అవ‌సరం అన్న వాద‌న కూడా ఉంది. దీనిని చంద్ర‌బాబు అంగీక‌రించేక మంచి ఫలితాలు ఇక్క‌డ రావొచ్చు అని ఓ వ్యాఖ్య ప‌రిశీల‌కుల నుంచి వినిపిస్తోంది.