Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైం సొంత జిల్లాలో బాబు రికార్డు మోత....?

By:  Tupaki Desk   |   14 Jan 2023 11:30 PM GMT
ఫస్ట్ టైం సొంత జిల్లాలో బాబు రికార్డు మోత....?
X
తెలుగుదేశం అధినేత చంద్రబాబుది నాలుగున్నర పదుల రాజకీయ జీవితం. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. 1978లో ఎలా ఉన్నారో ఎంత ఎనెర్జిటిక్ గా ఉన్నారో ఇపుడు కూడా అలాగే బాబు ఉండడం విశేషం. తన కొడుకు సమానుడు అయిన జగన్ తో సై అంటున్న చంద్రబాబుకు ఇన్నాళ్ళూ మైనస్ అయిన ఒక కీలక ప్రాంతం ఇపుడు కలసివస్తుందా అన్న చర్చ అయితే రాజకీయ వర్గాలలో సాగుతోంది.

రాయలసీమకు ఎన్టీయార్ ని దత్తపుత్రుడు అనేవారు. ఆయన సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరువాత నుంచి సీమ మీద ప్రత్యేక శ్రద్ధతో సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. రాయలసీమ క్షామనిధిని విరాళాలు భారీగా అందిస్తూ ఆయన సీమ జనానికి దత్తపుత్రుడు అయిపోయారు. ఆయనకు ఆ కాలం లీడర్స్ అయిన కోట్ల విజయభాస్కరరెడ్డి వంటి వారితో ఎంతో అనుబంధం ఉండేది.

ఇక సినిమాల్లో కూడా ఎన్టీయార్ పోషించే పౌరుషవంతమైన పాత్రలను సీమ జనాలే కాదు, రాజకీయ నేతలు సైతం ఇష్టపడేవారు. అలా ఎన్టీయార్ కి సీమలో సినిమా హీరోగా విశేష ఆదరణ ఉంది. అదే బాలయ్యకు కూడా తరువాత కాలంలో టర్న్ అయింది. ఎన్టీయార్ రాజకీయ రంగ ప్రవేశం చేశాక సీమ ప్రాంతాలు అన్నీ ఆయనకు వెన్నుదన్నుగా ఉంటూ వచ్చేవి. ఎన్టీయార్ వెంటే మేము అని మొత్తం ప్రాంతం జై కొట్టేది.

ఎపుడైతే ఎన్టీయార్ దివంగతులు అయ్యారో నాటి నుంచే సీమలో తెలుగుదేశానికి ఆదరణ తగ్గడం మొదలైంది. దానికి కారణం ఎన్టీయార్ అంటే విపరీతమైన ఆరాధనాభావం ఉన్న సీమ జనాలు ఆయన వెన్నుపోటు ఎపిసోడ్ ని జీర్ణించుకోలేకపోయారు. దాంతో సీమకే చెందిన చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ముందుకు సాగినా అది ఫక్తు కోస్తా పార్టీగానే అయిపోయింది.

సీమలో అనంతపురంలో కొంత తెలుగుదేశానికి లోకల్ లీడర్స్ వల్ల ఆదరణ ఉంది కానీ కడప కర్నూల్, చిత్తూరులలో ఎపుడూ మెజారిటీ సీట్లు తెలుగుదేశం తెచ్చుకున్నది లేదు. కానీ ఈసారి అలా కాదు అని తెలుగుదేశం నేతలే అంటున్నారు. ఈసారి జగన్ సొంత జిల్లా కడప నుంచే తెలుగుదేశం ప్రభంజనం స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు.

అలాగే చంద్రబాబు మూడుసార్లు ఏపీకి సీఎం అయినా ఆయన సొంత జిల్లా చిత్తూరులో మాత్రం అప్పట్లో కాంగ్రెస్ ఇపుడు వైసీపీదే పై చేయిగా ఉంది. 2019 ఎన్నికల్లో అయితే ఒక్క చంద్రబాబు తప్ప అన్ని సీట్లను వైసీపీ గెలుచుకుంది. కానీ 2024లో మాత్రం మొత్తం పొలిటికల్ సీన్ మారిపోతుంది అని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.

చంద్రబాబు కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. సీమ నుంచే చక్రం తిప్పాలనుకుంటున్నారు. అందుకే తన కుమారుడు లోకేష్ పాదయాత్రను చిత్తూరు జిల్లా కుప్పం నుంచి మొదలుపెట్టిస్తున్నారు. ఇక చూస్తే జగన్ చంద్రబాబులలో ఎవరు కావాలీ అంటే ఇప్పటిదాక జగన్ కే ఓటేశారు జనం. కానీ జగన్ సీఎం అయ్యాక సీమకు ప్రత్యెకంగా ఒరిగింది లేదు అన్న అసంతృప్తితో రగిలిపోతున్నారు.

ఇక సీమలో బడా నాయకులు అంతా కూడా ఇపుడు ఒక్క చోట చేరి యాంటీ వైసీపీ స్టాండ్ తీసుకుంటున్నారు. వారి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా తెలుగుదేశానికి సాయం చేయబోతున్నారు. ఫస్ట్ టైం బాబాయ్ వివేకానందరెడ్డి లేకుండా జగన్ కడప జిల్లా ఎన్నికలను ఫేస్ చేయబోతున్నారు. అది కూడా ఇబ్బందిగా మారుతోంది అంటున్నారు.

ఇంకో వైపు తెలుగుదేశానికి సహజంగానే బలిజల మద్దతు ఉంది. ఇపుడు జనసేనతో పొత్తులు ఉంటే సాలిడ్ గా ఆ సామాజికవర్గం ఈ వైపు టర్న్ అయితే కడప రాజాకీయాల్లోనే తేడాలు వస్తాయని అంటున్నారు. దాంతోనే చంద్రబాబు ధీమాగా మాట్లాడుతున్నారు. ఆయన ఈసారి చిత్తూరు జిల్లాలో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు లో ఎలా గెలుస్తారో చూస్తానంటూ భారీ సవాల్ విసిరారు.

పుంగనూరు లో తనకు ఎదురులేకుండా కంచుకోట కట్టుకున్న పెద్దిరెడ్డికే చుక్కలు చూపించేలా బాబు వ్యూహం ఉంటే ఇక నగరిలో రోజా పరిస్థితి ఎలా అన్నదే చర్చ. దీంతో పాటు తిరుపతి సహా ఇతర సీట్ల విషయంలోనూ తెలుగుదేశం పొత్తులతో ఆధిక్యత సాధిస్తుందని అంటున్నారు. అదే జరిగితే ఫస్ట్ టైం చంద్రబాబు నాయకట్వంలో తెలుగుదేశం సొంత జిల్లాలో జెండా ఎగరేసినట్లు అవుతుంది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబుకు సొంత జిల్లా చిత్తూరులో ఎపుడూ పట్టు లేదని, గతంలో కాంగ్రెస్ ఇపుడు వైసీపీ ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకుంటూ వస్తున్నాయని పెద్దరిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు. చంద్రబాబుది ఏడుపుగొట్టు రాజకీయమని ఆయన లైట్ తీసుకుంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో అలాంటి పరిస్థితి ఉందా అన్నదే పెద్దిరెడ్డి ఒకసారి చెక్ చేసుకోవాలని అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.