Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ 1000 రోజుల పాల‌న‌.. 1000 త‌ప్పులు!.. టీడీపీ చార్జ్ షీట్‌

By:  Tupaki Desk   |   9 March 2022 11:30 AM GMT
జ‌గ‌న్ 1000 రోజుల పాల‌న‌.. 1000 త‌ప్పులు!.. టీడీపీ చార్జ్ షీట్‌
X
సీఎం జగన్ రెడ్డి తన వెయ్యి రోజుల పాలనలో వెయ్యి తప్పులు చేశారంటూ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప్రజా ఛార్జిషీట్ విడుదల చేసింది. విధ్వంస పాలనలో 1000 నేరాలు, ఘోరాలు, లూటీలు, అసత్యాలు పేరిట ప్రత్యేక సంచికను.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా పలువురు పార్టీ నేతలు విడుదల చేశారు.

ప్రజావేదిక కూల్చివేత వంటి అశుభకార్యంతో పాలన ప్రారంభించిన జగన్‌.. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేత తర్వాత అమరావతి నిర్వీర్యానికి శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు.

చంద్రబాబుకు పేరొస్తుందనే.. అమరావతిని సర్వనాశనం చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ విద్వేషాల కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. ఎప్పుడూ లేని విధంగా దేవాలయాలపై దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సొంత బాబాయి వివేకానంద రెడ్డితోపాటు కోడెల శివప్రసాదరావు, మాస్క్ అడిగిన వైద్యుడు సుధాకర్ ఇలా ఎంతోమంది చావులకు కారకులని అన్నారు. ప్రజలకు మంచి చేద్దామని చెప్పిన సొంత పార్టీ ఎంపీనే పోలీసులతో కొట్టించారని ఆరోపణలు చేశారు.

కక్షసాధింపు కోసమే జగన్ అధికారంలోకి వచ్చారని.. దుయ్యబట్టారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి చేసిన దాడులకు ఎన్నో పరిశ్రమలు తరలిపోయాయని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలపై మునుపెన్నడూ లేని విధంగా దాడులు చేశారని మండిపడ్డారు. దాడులు, కిడ్నాప్ లు, బెదిరింపులతో స్థానిక సంస్థల ఎన్నికల్ని అపహాస్యం చేశారని ఆక్షేపించారు.

చంద్రబాబు హయాంలో రూ.6లక్షల కోట్లు అవినీతంటూ చేసిన ఆరోపణల్లో.. ఒక్కటి కూడా రుజువు చేయలేదని తెల్చిచెప్పారు. సొంత కంపెనీ సిమెంట్ ధరలు పెంచేందుకు ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్నారని ధ్వజమెత్తారు.