Begin typing your search above and press return to search.

‘ఏరిపారేస్తాం’ లాంటి మాటలు చెప్పటం కాదు చేతల్లో చూపించాలి బాబు

By:  Tupaki Desk   |   10 Dec 2021 1:30 AM GMT
‘ఏరిపారేస్తాం’ లాంటి మాటలు చెప్పటం కాదు చేతల్లో చూపించాలి బాబు
X
వంద మాటలు చెప్పే కన్నా.. చేతల్లో ఒక చర్య చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు. అధికారంలో ఉన్నప్పుడే కాదు.. అధికారంలో లేనప్పుడు కూడా చర్యలు తీసుకునే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరించే విధానం విచిత్రంగా ఉంటుంది.

ఒకపక్క పార్టీకి నష్టం వాటిల్లుతుందని చెబుతూనే.. అలాంటి వారిపై చర్యల కత్తి ఝుళిపిస్తే జరిగే నష్టం ఏమీ ఉండదు. కానీ.. అలాంటిదేమీ చేయని ఆయన తీరు తరచూ చర్చగా మారుతుంటుంది. తాజాగా ఆయన కుప్పం మున్సిపల్ ఎన్నికల సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒక్క కుప్పమే కాదు.. మరికొన్ని చోట్ల కూడా పార్టీలో కోవర్టులు తయారయ్యారన్నారు. పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని.. కేసులు.. దాడులకు భయపడకుండా వేల మంది పార్టీ కార్యకర్తలు పోరాడుతున్నారన్నారు.

కానీ.. కొంత మంది మాత్రం ప్రత్యర్థులకు భయపడి.. వారికి లొంగిపోయి వ్యవహరిస్తున్నారన్నారు. అలాంటి వారిని ఉపేక్షించనని వ్యాఖ్యానించారు. కుప్పంపై అధికార పార్టీ కొన్ని నెలలుగా తీవ్రంగా ఫోకస్ చేసిన విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదని.. స్థానిక నేతలు అతి విశ్వాసంతో వ్యవహరించారన్నారు.

ఒకవేళ అదే నిజమని అనుకుందాం. మరి.. చంద్రబాబు ఏం చేస్తున్నట్లు? అన్న ప్రశ్న తలెత్తక మానదు. కుప్పం పరాజయాన్ని స్థానిక నేతల ఖాతాలో వేసి చంద్రబాబు.. ఓటమికి కారణమైన వారు.. ప్రత్యర్థులతో చేతులు కలిపిన వారు.. పార్టీకి అన్యాయం చేసిన వారు.. ఇలా.. ద్రోహానికి పాల్పడిన వారి మీద చర్యలు తప్పవని చెప్పే బదులు.. సమీక్షా సమావేశంలోనే ఆ జాబితాను విడుదల చేసి ఉంటే బాగుండేది కదా? అన్న మాట వినిపిస్తోంది. అందరిని కలుపుకొని పోయే అవకాశం ఉండదు.

అందునా రాజకీయంగా నష్టం చేస్తున్న వారిపై చర్యలు వేగంగా తీసుకోవాలి. కానీ.. చంద్రబాబు మాత్రం ఎప్పుడూ ఇలాంటి విషయాల్లో సాగదీతను ప్రదర్శిస్తారే తప్పించి.. కట్ చేయరు. ఏరివేస్తానంటూ బింకంగా మాటలు చెప్పే చంద్రబాబు.. ముందు పార్టీకి నష్టం చేసే వారి విషయంలో కరకుగా వ్యవహరించాలన్నది మర్చిపోకూడదు. అలాంవి ఎప్పుడు చేస్తారో?