Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో టీడీపీ కలర్ స్ట్రాటజీ

By:  Tupaki Desk   |   13 Jun 2019 2:12 PM IST
అసెంబ్లీలో టీడీపీ కలర్ స్ట్రాటజీ
X
వాగ్బలం లేకపోయినా నోటికి తుంపర్ల బలం ఉంటే నలుగురి నోరు మూయించొచ్చన్న సరదా సామెత ఒకటుంది.. అలాగే, సంఖ్యాబలం లేకున్నా సరైన రంగు బట్టలేస్తే అసెంబ్లీలో ఏ మూల కూర్చున్నా హైలెట్ అవుతామని టీడీపీ అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో బొక్కబోర్లా పడడంతో 23 సీట్లకు పడిపోయిన టీడీపీ అసెంబ్లీలో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల మధ్య కనిపించే పరిస్థితి లేదు. ఎటు చూసినా వైసీపీ కండువాలే ఉన్న అసెంబ్లీలో తామూ కనిపించాలంటే పార్టీ రంగు పసుపును నమ్ముకోవాలని టీడీపీ నేతలు భావించినట్లున్నారు. అందుకే చంద్రబాబు సహా అందరూ కొట్టొచ్చినట్లు కనిపించే పసుపు రంగు చొక్కాలతో అసెంబ్లీకి వస్తున్నారు.

ఎలక్షన్లలో సరైన స్ట్రాటజీ లేక ఓటమి పాలైన టీడీపీ అసెంబ్లీలో మాత్రం కలర్ స్ట్రాటజీతో అదరగొట్టేసిందని.. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్తున్నా - బయటకు వస్తున్నా కూడా 100 మందిలో ఉన్నా హైలైట్ అవుతున్నారని అటు వైసీపీ నేతలు - ఇటు మీడియా వాళ్లు కూడా సెటైర్లు వేస్తున్నారు.

కొందరు వైసీపీ నేతలైతే తమకు బాగా పరిచయం ఉన్న టీడీపీ నేతలతో డైరెక్టుగా ఇదే విషయం అంటున్నారట. పచ్చ పార్టీ అన్న పేరు సార్థకం చేసుకునేలా చొక్కాలు వేసుకుంటున్నారని సెటైర్లు వేస్తున్నారు. దీనికి ఆయా సభ్యులు.. ''ఏం చేస్తామన్నా.. సార్ ఆర్డర్. కాదనలేం కదా. అందుకే, నచ్చకపోయినా ఈ పసుపు చొక్కా వేసుకుని తిరుగుతున్నాం'' అంటున్నారట.