Begin typing your search above and press return to search.

విశాఖ, అనకాపల్లి టికెట్స్ వీరికేనట..

By:  Tupaki Desk   |   8 March 2019 6:35 AM GMT
విశాఖ, అనకాపల్లి టికెట్స్ వీరికేనట..
X
టీడీపీ టికెట్ల పంచాయతీ అమరావతిలో వేడి పుట్టిస్తోంది. అవినీతి ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వవద్దని.. పార్టీని నమ్ముకున్న సీనియర్లకు ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు నిరసనలు తెలుపుతున్నారు. గురువారం రాత్రి విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అభ్యర్థుల ఖరారుపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్షించారు. ఇందులోనే విభేదాలు భగ్గుమన్నాయి.

వివాదాలు లేని చోట్ల చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేశారు. విశాఖ తూర్పునకు వెలగపూడి రామకృష్ణ, విశాఖ పశ్చిమకు పీజేవీఆర్ నాయుడు , విశాఖ దక్షిణానికి వాసుపల్లి గణేష్ కుమార్, పెందుర్తికి బండారు సత్యనారాయణ మూర్తి, గాజువాకకు పల్లా శ్రీనివాసరావు, నర్సీపట్నానికి అయ్యన్న పాత్రుడు, అరకకు కిడారి శ్రావణ్ కుమార్, పాడేరుకు గిడ్డి ఈశ్వరీకి తొలివిడతలో చంద్రబాబు టికెట్లు ఖరారు చేశారని సమాచారం.

ఇక పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో అరకు ఎంపీ స్థానానికి మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఖాయమని సమాచారం. ఇక అనకాపల్లి ఎంపీ సీటు కోసం మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ పట్టుబట్టినట్లు సమాచారం. విశాఖ ఎంపీ సీటుకు గంటా శ్రీనివాసరావు, ఎం శ్రీభరత్ పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

ఇక ఈ సమీక్షలో పాయరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితపై అసమ్మతి సెగ రాజుకుంది. అనిత అభ్యర్థిత్వాన్ని ఆ నియోజకవర్గ నేతలంతా వ్యతిరేకించినట్టు సమాచారం.. ఎమ్మెల్యే అవినీతి తారాస్తాయికి చేరిందని.. మళ్లీ ఆమెకు టికెట్ ఇస్తే ఘోరంగా టీడీపీ ఓడిపోతుందని నేతలు చంద్రబాబు, పార్టీ పెద్దల ఎదుట కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే ఎమ్మెల్యే అనిత, అసమ్మతి నేతల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకున్నట్టు తెలిసింది. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని అనిత.. చంద్రబాబును కోరినట్లు సమాచారం.

ఇక చోడవరం టికెట్ పై కూడా టీడీపీ నేతలు గళం వినిపించారు. చోడవరం ఎమ్మెల్యే కేఎస్ ఎన్ ఎస్ రాజుకు ఈసారి టికెట్ ఇవ్వవద్దని.. పార్టీలో సీనియర్లు చాలా మంది ఉన్నారని.. చోడవరంలో ఎక్కువగా ఉన్న కాపు సామాజిక వర్గం దృష్టా కాపు నేతలకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు.

విశాఖ ఎంపీ టికెట్ విషయంలో మంత్రి గంటాకు కాకుండా మెజార్టీ ఎమ్మెల్యేలు బాలయ్య చిన్నల్లుడు భరత్ కు ఇవ్వాలని సూచించడం విశేషం. అయితే దీనివెనుక డబ్బులు చేతులు మారినట్లు వార్తలు వచ్చాయి. భరత్ ఒక్కో ఎమ్మెల్యేకు 40లక్షలు ఎరచూపారని.. ఒకరిద్దరికి ఇచ్చినట్టు కూడా ప్రచారం జరిగింది. మెజార్టీ ఎమ్మెల్యేలు భరత్ పేరును ఇందుకే ప్రతిపాదించినట్టు సమాచారం.