Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ ను వదలని డేటాచోరీ..

By:  Tupaki Desk   |   7 March 2019 7:41 AM GMT
టీఆర్ ఎస్ ను వదలని డేటాచోరీ..
X
డేటా చోరీ కేసు.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైంది. టీడీపీ ప్రభుత్వ అక్రమ డేటా చోరీపై వైసీపీ ఫిర్యాదు చేయడం.. తెలంగాణ ప్రభుత్వం దానిపై సిట్ ఏర్పాటు చేసిన దరిమిలా టీడీపీ కూడా ఎదురుదాడికి సిద్దమైంది. తమతోపాటు టీఆర్ ఎస్ ను ఇరికిచ్చేందుకు తాజాగా స్కెచ్ గీసింది.

తెలంగాణ ఎన్నికల సమయంలో టీఆర్ ఎస్ మిషన్ కాల్ క్యాంపెయిన్ పేరుతో ఒక ప్రాజెక్టును కేటీఆరే ముందుండి నడిపించారని తాజాగా కొన్ని వీడియోలు - సాక్ష్యాలను టీడీపీ నేతలు - అనుకూల మీడియా రిలీజ్ చేశాయి. దీనికి సంబంధించిన పలు స్క్రీన్ షాట్లు ఓ వీడియో వైరల్ అవుతున్నాయి. ఒక వ్యక్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. తాను టీఆర్ఎస్ మిషన్ డాట్ కామ్ లో మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించిన లబ్ధిదారుల డేటా అప్ లోడ్ చేశానని.. ఫోన్ నంబర్లు - చిరునామా - ఆధార్ వివరాలు అందులో ఉన్నట్టు చెప్పారు.

తాజాగా తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ ఎస్ వలంటీర్లు నేరుగా లబ్ధిదారులతో మాట్లాడే విధంగా.. www.trsmission.com వెబ్ సైట్ ను - టీఆర్ ఎస్ ’మిషన్ కాల్ క్యాంపెయిన్’ యాప్ ను దక్షిణాఫ్రికా - న్యూజెర్సీ టీఆర్ ఎస్ ఎన్నారై విభాగం రూపొందించింది. దాని ద్వారా కాల్ చేసి లబ్ధిదారులను వలంటీర్లు ఆకర్షిస్తారు. ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన వారికి ఫోన్ చేసి వారి నుంచి ఫీడ్ బ్యాక్ ను సేకరించడమే ఈ వలంటీర్ల పని.

నియోజకవర్గాల లబ్ధిదారులు - ఓటర్ల వివరాలను కేంద్ర కార్యాలయం నుంచే వెబ్ సైట్.., యాప్ లో అప్ లోడ్ చేస్తామని టీఆర్ ఎస్ అప్పట్లో కరపత్రంలో పేర్కొంది. ఈ వెబ్ సైట్ - యాప్ లో లబ్ధిదారుల వివరాలు గోప్యంగా ఉంటామని పేర్కొంది. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన లబ్ధిదారుల డేటా ఈయాప్ లోకి రావడంపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు డేటా చోరీ అని ఏపీ ప్రభుత్వం చేసిందే టీఆర్ ఎస్ చేసిందని.. దీనిపైన విచారణ జరపాలని టీడీపీ నేతలు కోరుతున్నారు.

ఇది దుమారం రేగడంతో తాజాగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీఆర్ ఎస్ మిషన్ యాప్ ను తొలగించారు. వెబ్ సైట్ కూడా పనిచేయడం లేదు. ఐటీ గ్రిడ్స్ పేరిట ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చినట్టే టీడీపీ బయటకు తీసిన ఈ మిషన్ టీఆర్ ఎస్ వ్యవహారం కూడా సంచలనంగా మారింది.