Begin typing your search above and press return to search.

జ‌న‌సైనికులు ఇక సైలెంట‌వుతారా?

By:  Tupaki Desk   |   9 Jan 2023 7:16 AM GMT
జ‌న‌సైనికులు ఇక సైలెంట‌వుతారా?
X
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆదివారం మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఆయన ఇంటికి వెళ్లి జనసేనాని పవన్ కళ్యాణ్ కలవడం చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం, జనసేన కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నాయనడానికి ఇది మరో బలమైన సంకేతంలా కనిపించింది.

పొత్తు గురించి ఈ సమావేశానంతరం జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు కానీ, పవన్ కానీ ఏమీ మాట్లాడకపోయినా.. ఆ దిశగా కీలకమైన ముందడుగు పడినట్లే భావిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు కొన్ని నెలల కిందటే చాలా ఏళ్ల తర్వాత కలిశారు.

విశాఖపట్నం పర్యటన సందర్భంగా పవన్‌ను పోలీసులు నిర్బంధించి, ఇబ్బంది పెట్టడాన్ని ఖండిస్తూ విజయవాడ నోవాటెల్‌లో చంద్రబాబు జనసేనానిని కలవడం తెలిసిందే. అప్పుడే పొత్తు దిశగా తొలిసారి బలమైన సంకేతాలు కనిపించాయి.

ఐతే 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు స్వయంగా వెళ్లి పవన్‌ మద్దతు కోరడాన్ని గుర్తు చేస్తూ.. మరోసారి బాబే పవన్‌ను కలిశాడని, పొత్తు కోసం అడుక్కుంటున్నారని జనసైనికులు కొందరు ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు. ఇది తెలుగుదేశం వారికి రుచించలేదు.

ఈ విషయమై జనసైనికులతో సోషల్ మీడియా వేదికగా వాదోపవాదాలు, గొడవలు నడిచాయి. కట్ చేస్తే ఇప్పుడు పవన్.. చంద్రబాబు ఇంటికి వెళ్లి కలవడంతో లెక్క సరిచేసినట్లయింది.

ఇప్పుడు తెలుగుదేశం వాళ్లు ఈ పాయింట్ మీద జనసైనికులకు కౌంటర్లు వేస్తున్నారు. అదే సమయంలో ఎవరు ఎవరు కోసం వచ్చారు.. ఎవరిది పైచేయి లాంటి డిబేట్లు మానేయడం బెటర్ అనే అభిప్రాయాలు ఎక్కువమంది నుంచి వినిపిస్తున్నాయి.

ఇటు బాబు, అటు పవన్.. రెండు పార్టీల కార్యకర్తలు, అభిమానులు కలిసి పని చేయక తప్పదని సంకేతాలు ఇస్తున్నారని.. పొత్తు దిశగా ఇరు పార్టీల క్యాడర్‌ను సన్నద్ధం చేయడమే దీని ఉద్దేశమని.. ఇగోలు పక్కన పెట్టి ఉమ్మడి శత్రువును గద్దె దించే లక్ష్యంగా అడుగులు వేయాల్సిన ఆవశ్యకతను చెప్పకనే చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.