Begin typing your search above and press return to search.

బాబు మిస్టేక్ వల్లే గుడివాడ, గన్నవరంల్లో ‘సైకిల్’ దెబ్బతిందా..?

By:  Tupaki Desk   |   24 Aug 2021 12:30 PM GMT
బాబు మిస్టేక్ వల్లే గుడివాడ, గన్నవరంల్లో ‘సైకిల్’ దెబ్బతిందా..?
X
కృష్ణా జిల్లా గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలు పేరు చెబితే చాలు...తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు అని అర్ధమైపోతుంది. అయితే కంచుకోటలు ఒక్కప్పుడు మాత్రమే. ఇప్పుడు ఆ రెండుచోట్ల టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఇలా టీడీపీ పరిస్థితి దెబ్బతినడానికి పరోక్షంగా చంద్రబాబే కారణమని కొందరు టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఎందుకంటే 2004 ముందు వరకు గుడివాడలో టీడీపీని దివంగత రావి శోభనాద్రి ఫ్యామిలీ చూసుకునేది. శోభనాద్రి, ఆయన తనయులు హర గోపాల్, వెంకటేశ్వరరావులు పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. వీరు ముగ్గురు ఎమ్మెల్యేలుగా గెలిచి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.

కానీ 2004 ఎన్నికల్లో రావి ఫ్యామిలీని కాదని చంద్రబాబు, కొడాలి నానికి సీటు ఇచ్చారు. ఇక 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచి, బాగా ఫాలోయింగ్ పెంచుకున్న నాని, ఆ తర్వాత వైసీపీలోకి జంప్ కొట్టారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ తర‌పున నాని గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు మంత్రిగా ఉంటూ, చంద్రబాబుపై ఎలాంటి విమర్శలు చేస్తున్నారో తెలిసిందే. అయితే నాని టీడీపీని వీడాక, గుడివాడలో ఆ పార్టీ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది. నాని టీడీపీలో ఎదిగి, టీడీపీ క్యాడర్‌ని చాలా వరకు తనవైపు తిప్పేసుకున్నారు. దీంతో మళ్ళీ చంద్రబాబు, రావి వెంకటేశ్వరరావుని తీసుకొచ్చి గుడివాడలో పెట్టారు. అయినా సరే ఇక్కడ టీడీపీ పైకి లేచేలా కనిపించడం లేదు.

అటు గన్నవరంలో కూడా అదే పరిస్థితి..అప్పటివరకు టీడీపీకి అండగా ఉన్న దాసరి బాలవర్ధనరావుని చంద్రబాబు సైడ్ చేసి, 2014లో వల్లభనేని వంశీకి సీటు ఇచ్చారు. ఇక వంశీ 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తర‌పున గెలిచారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు పార్టీలో బాగానే పనిచేసిన వంశీ, అధికారం కోల్పోయాక టీడీపీని వీడి వైసీపీలోకి జంప్ కొట్టారు. దీంతో ఇప్పుడు గన్నవరంలో టీడీపీ పరిస్తితి ఘోరంగా తయారైంది. బచ్చుల అర్జునుడు ఇంచార్జ్‌గా ఉన్నా సరే పార్టీ బలోపేతం కావడం లేదు.

టీడీపీలో మంచిగా ఫాలోయింగ్ తెచ్చుకున్న వంశీ..వైసీపీలోకి వెళ్ళడంతో గన్నవరంలో టీడీపీ పరిస్థితి అదోగతి పాలైంది. ఇలా గుడివాడ, గన్నవరంలో పరోక్షంగా చంద్రబాబే టీడీపీని దెబ్బతినడానికి కారణమని టీడీపీ సీనియర్లు భావిస్తున్నారు. అప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ బ‌లంగా, పార్టీకి క‌మిట్‌మెంట్‌తో ప‌నిచేస్తోన్న నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్ట‌డంతోనే ఈ దుస్థితి ఏర్ప‌డింది.