Begin typing your search above and press return to search.

బద్వేలులో బీజేపీని ఆదుకున్న టీడీపీ

By:  Tupaki Desk   |   31 Oct 2021 10:30 AM GMT
బద్వేలులో బీజేపీని ఆదుకున్న టీడీపీ
X
అవును మీరు చదివింది నిజమే. బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీని టీడీపీ నేతలే ఆదుకున్నారు. ఇంతకీ బీజేపీని టీడీపీ ఏ విధంగా ఆదుకుంది ? ఏ విధంగా అంటే నియోజకవర్గంలోని 281 పోలింగ్ కేంద్రాల్లో చాలా చోట్ల బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ నేతలే కూర్చున్నారు. పోటీ చేయడం కాదు కదా కనీసం అన్నీ పోలింగ్ కేంద్రాల్లో కనీసం పోలింగ్ ఏజెంట్లను కూడా పెట్టుకోలేని దీనస్థితి బీజేపీది. అలాంటిది వైసీపీ అభ్యర్ధిని ఓడిస్తామని బీజేపీ నేతలు తొడగొడితే ఎవరన్నా నమ్ముతారా ?

తమ పరిస్థితి ఏమిటో కమలనాథులకు బాగా అర్ధమైపోయింది. అందుకనే పోలింగ్ కు పదిరోజులకు ముందే టీడీపీ నేతలతో మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నది కూడా రెండు పద్దతుల్లో. అదేమిటంటే మొదటిది పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవటం, రెండోది ఓట్లు వేయించటం. ఎలాగూ పోటీలో టీడీపీ లేదు కాబట్టి తమ్ముళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారట. అందుకనే పోలింగ్ లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ తరపున పోలింగ్ ఏజెంట్లు కనిపించారు. విషయం ఏమిటంటే టీడీపీ స్ధానిక నేతలే కమలం పార్టీ ఏజెంట్లుగా కూర్చున్నారు.

ఎలాగూ ఒప్పందం జరిగింది కాబట్టి కొన్నిచోట్ల తమ్ముళ్ళే బీజేపీ అభ్యర్ధికి ఓట్లు కూడా వేయించారని సమాచారం. కారణాలు ఏదైనా పోలింగ్ 69 శాతం నమోదైంది. 2019 ఎన్నికల్లో 77 శాతం నమోదైంది. టీడీపీ పోటీలో లేకపోయినా 69 శాతం పోలింగ్ నమోదైందంటే పోలింగ్ గట్టిగా జరిగినట్లే అనుకోవాలి. అంటే టీడీపీ ప్రభావం ఈ ఎన్నికలో ఏమీ లేదని అర్ధమవుతోంది. ఎందుకంటే టీడీపీకి సుమారు 30 శాతం ఓట్లున్నాయి. టీడీపీ పోటీలో లేనపుడు ఆ ఓట్లన్నీ ఎటు పడ్డాయి ? లేకపోతే అసలు పోలింగ్ కే రాలేదా ? పోలింగ్ కు దూరంగానే ఉండేట్లయితే 69 శాతం పోలింగ్ నమోదుకాదు.

కాబట్టి మెజారిటీ ఓట్లు వైసీపీకి పడుండాలి. అలాగే చెదురుమదురుగా కొన్ని బీజేపీకి కూడా పడుండాలని స్థానిక నేతలంటున్నారు. టీడీపీ సహకారం లేకపోతే బీజేపీకి అసలు ఓట్లు పడే అవకాశమే లేదంటున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 735 మాత్రమే. ఇప్పుడు అంతకుమించి ఓట్లు గనుక పోలైతే కచ్చితంగా టీడీపీ నేతలు బీజేపీకి సహకరించినట్లే అనుకోవాలి. పోలింగ్ ఏజెంట్లనే పెట్టుకోలేని పార్టీకి ఎన్ని ఓట్లొస్తాయో 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్లే సాక్ష్యం.

ఏదెలాగున్నా స్ధానిక నేతల మధ్య జరిగిన సర్దుబాటు రేపటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపకపోతుందా అని తమ్ముళ్ళు ఆశగా ఉన్నారు. ఎందుకంటే బీజేపీ నేతల వైఖరి ఎలాగున్నా వచ్చే ఎన్నికల నాటికి కమలం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అందరు చూస్తున్నదే. మరి చంద్రబాబు ఆశలు నెరవేరుతాయా ? లేదా అన్నది ఆసక్తిగా మారింది.