Begin typing your search above and press return to search.

ఆగమాగం ఎందుకు బాబూ... ?

By:  Tupaki Desk   |   24 Oct 2021 12:30 AM GMT
ఆగమాగం ఎందుకు బాబూ... ?
X
రాజకీయ పార్టీలు అన్నాక ఓపిక సహనం ఉండాలి. అన్నీ అనుకున్నట్లుగా సరిపోవు. జీవితకాలం పనిచేసినా కొందరికి అధికారం దక్కడం కలగానే మిగులుతుంది. అలాంటిది ఎన్టీయార్ లాంటి వారు ఇలా రాజకీయాల్లోకి రాగానే అలా సీఎం అయిపోయారు. ఒక విధంగా చెప్పుకుంటే చాలా విషయాల్లో తెలుగుదేశం పార్టీ లక్కీ అనే చెప్పాలి. వచ్చే ఏడాది మార్చి 29 నాటికి టీడీపీకి నాలుగు పదుల వయసు వస్తుంది. ఇందులో సగం కాలం పైగా అంటే 22 ఏళ్ల పాటు టీడీపీ అధికారం అనుభవించింది. ఎన్టీయార్ ఏడున్నార ఏళ్లకు పైగా సీఎం గా పనిచేస్తే చంద్రబాబు పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ఇక రాజకీయంగా చూస్తే చంద్రబాబు అనుభవశాలి. ఆయన్న ఒక్కో మెట్టూ ఎక్కి సీఎం సీటు దాకా వచ్చారు. మరి ఆయనకు తెలియని విషయాలు కూడా ఏవీ లేవు. ప్రజల ఆశీర్వాదం ఉంటేనే ఎవరైనా సీఎం అయ్యేది. చంద్రబాబు కూడా అలాగే అయ్యారు. మరి అలాంటిది ప్రజలు ఎన్నుకున్న ఒక పాపులర్ ప్రభుత్వాన్ని మధ్యలో దిగిపోమని కోరడం రాజకీయ దివాళాకోరుతనం కాక మరేమిటి. ఏపీలో 151 సీట్లతో జగన్ పవర్ లో ఉన్నారు. ఆయన సీఎం అయినది మొదలు దిగిపో అంటూనే ఉంది టీడీపీ. అదే సమయంలో ఎన్నో రకాలుగా పాలనను అడ్డుకుంటున్నారు. దీని వల్ల కోరి జగన్ తప్పులు చేసినా కూడా అవన్నీ ఇండైరెక్ట్ గా టీడీపీ ఖాతాలోకి పోతున్నాయి.

ఈ సంగతి చంద్రబాబు ఈ రోజుకీ గ్రహించినట్లు లేదు అంటున్నారు. ఈ మధ్య దాకా ఏపీలో ఆర్ధిక పరిస్థితి బాలేదని, అత్యవసర పరిస్థితి విధించాలని డిమాండ్ చేసిన టీడీపీ తమ్ముళ్లు ఇపుడు రాష్ట్రపతి పాలన అంటున్నారు. నిజానికి రాష్ట్రపతి పాలన విధిస్తే బాబుకు కానీ టీడీపీకి కానీ ఒరిగేది ఏముంటుంది. జగన్ నెత్తినే పాలు పోసినట్లు అవుతుంది. ఏపీలో జగన్ని అర్ధాంతంగా దించేశారు అన్న సానుభూతి వెల్లువలా వస్తుంది. మళ్లీ ఆయనే సీఎం అవుతారు. ఇక రాష్ట్రపతి పాలన అంటే గవర్నర్ చేతిలోకి అధికారాలు వెళ్తాయి. అలా కేంద్రంలోని బీజేపీ చేతికి అధికార పగ్గాలు వస్తాయి. మొత్తానికి చూసుకుంటే దీని వల్ల తెలుగుదేశానికి పైసా కూడా రాజకీయ లాభం ఉండదు.

మరి అన్నీ తెలిసి బాబు ఎందుకు ఈ డిమాండ్ చేస్తున్నారు అన్నదే అంతు చిక్కని ప్రశ్న. జగన్ ఒకసారి దిగిపోతే మాజీ సీఎం అయితే చూడాలన్న దురాశ తప్ప తమకు ఏది మేలు చేస్తుంది అన్న వ్యూహం లేకుండా ఆగమాగం అయితే బోల్తా పడేది మరో సారి సైకిల్ పార్టీనే అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక ఏపీలో చూసుకుంటే ఈ రోజుకు కూడా పెద్దగా జగన్ సర్కార్ మీద వ్యతిరేకత లేదు. మరో సగం పాలన మిగిలి ఉంది కాబట్టి యాంటీ ఇంకెంబెన్సీ పెరిగితే పెరగవచ్చు. ఆ రోజు వరకూ వేచి చూసి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తే టీడీపీకి ఏమైనా లాభం ఉండవచ్చు. అంతే తప్ప జగన్ని అర్జంటుగా దించేయండి అంటూ డిమాండ్ తో వెళ్తే అది బూమరాంగ్ అవుతుంది. జగన్ మీద సానుభూతిగా మారి టీడీపీయే జనంలో అసలైన దోషిగా నిలబడక తప్పదు.