Begin typing your search above and press return to search.

సీన్ రివ‌ర్స్‌: వైసీపీ ఎంపీకి.. టీడీపీ మాజీ మంత్రి స‌పోర్ట్‌.. విష‌యం

By:  Tupaki Desk   |   6 Aug 2021 3:06 AM GMT
సీన్ రివ‌ర్స్‌:  వైసీపీ ఎంపీకి.. టీడీపీ మాజీ మంత్రి స‌పోర్ట్‌.. విష‌యం
X
రాష్ట్ర రాజ‌కీయాల్లో ఇదో అనూహ్య ఘ‌ట్టం. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నేత‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారంటూ.. టీడీపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. అక్ర‌మ మైనింగ్‌కు పాల్ప‌డుతున్నార‌ని.. గ్రావెల్ త‌వ్వ‌కాలు చేసి ప్ర‌జాధ‌నం కొల్ల‌గొడుతున్నార‌ని.. టీడీపీ నాయ‌కులు విరుచుకుప‌డుతున్నారు. వారు వీరు.. అనే తేడా లేకుండా.. వైసీపీ నేత‌ల‌పై టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. స‌హ‌జంగా అధికార పార్టీ నేత‌ల‌పై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించ‌డం.. వారు చేస్తున్న ప‌నుల‌ను నిశితంగా గ‌మ‌నించి.. లోపాలు ఎత్తి చూప‌డం అనేది ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా టీడీపీ బాధ్య‌త‌. కాబ‌ట్టి ఈ విమ‌ర్శ‌ల‌ను అర్ధం చేసుకోవ‌చ్చు.

టార్గెట్ కాకాణి!

అయితే.. స‌హ‌జ ధోర‌ణికి భిన్నంగా టీడీపీ మాజీ మంత్రి, సీనియ‌ర్ పొలిటీషియ‌న్ సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి.. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మ‌ద్ద‌తుగా మాట్టాడ‌డం, అక్ర‌మ మైనింగ్ విష‌యంలో ఏకంగా ఆయ‌న‌కు క్లీన్ చిట్ ఇవ్వ‌డం రాజ‌కీయ ప‌రిశీల‌కుల‌ను విస్మ‌యానికి గురి చేస్తోంది. అంతేకాదు, అధికార పార్టీలోనూ ఈ విష‌యం తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయింది. అస‌లు ఏం జ‌రిగిందంటే.. గ‌త ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరు జిల్లాలో వైసీపీ నేత‌లు అక్ర‌మ మైనింగ్‌కు పాల్ప‌డుతున్నార ని.. కొన్నాళ్లుగా టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ముఖ్యంగా సోమిరెడ్డి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం స‌ర్వేప‌ల్లిలో అక్ర‌మ మైనింగ్ జ‌రుగుతోంద‌ని.. ఆరోపిస్తున్నారు. దీని వెనుక ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఉన్నార‌ని కూడా ఆయ‌న చెబుతున్నారు.

ఆ ఎంపీ అమాయ‌కుడు

అయితే.. ఈ అక్ర‌మ మైనింగ్‌లో ఇటీవ‌ల ప్ర‌కాశం జిల్లా ఒంగోలు నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా విజ‌యం సాధించిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు తెర‌మీదికి వ‌చ్చింది. అయితే.. దీనిని సోమిరెడ్డి ఖండించారు. సర్వేపల్లిలో గ్రావెల్ మాఫియా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి తెలియకుండా ఆయన పేరుతో అనుమతి తీసుకున్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నీటిపారుదల శాఖ నుండి అక్రమార్కులు త‌ప్పుడు మార్గంలో అనుమతి తీసుకున్నట్టు మాజీ మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. అక్ర‌మ గ్రావెల్ త‌వ్వ‌కాల‌పై పోలీసులు, ఇరిగేషన్ అధికారులు రంగంలోకి దిగి మాఫియాకు అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారని, అయితే, మాగుంట‌కు దీనితో సంబంధం లేద‌ని సోమిరెడ్డి చెబుతున్నారు.

మాగుంట‌ను ఇరికించారా?

అంతేకాదు, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తన దోపిడీ కోసం సొంత పార్టీకి చెందిన ఎంపీని బలి చేయడానికి సిద్ధపడ్డారని సోమిరెడ్డి ఆరోపించడం మ‌రింత వివాదంగా మారింది. మైనింగ్ అనుమతుల కోసం కాకాణి తన అనుచరులతో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేయించారని, సర్వేపల్లి రిజర్వాయర్ గ్రానైట్ తవ్వకానికి అక్రమ దరఖాస్తు పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో తమ మీదకు రాకుండా మాగుంట శ్రీనివాస్ రెడ్డిని కేసులో ఇరికించారని ఆయన విమ‌ర్శించారు. దరఖాస్తు పెట్టింది వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అయితే దీనిపై పోలీసులు ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు ఎవరి ఆదేశాల మేరకు మాగుంట పేరును ఏ2 గా చేర్చారని నిల‌దీశారు.

మొన్న టీడీపీ ఎంపీల‌కు పార్టీ.. నేడు స‌పోర్ట్‌!

అక్రమ గ్రావెల్‌ వ్యవహారంలో వాహనాలను పట్టుకున్న పోలీసులు కాకాణి గోవర్ధన్ రెడ్డికి అనుకూలంగా ఈ కేసులో ఎలాంటి సంబంధం లేని మాగుంట శ్రీనివాసులు రెడ్డిని టార్గెట్ చేశారని సోమిరెడ్డి మండ‌ప‌డ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కాకాణి గోవర్ధన్ రెడ్డిదే కీల‌క పాత్ర అని ఆరోపించిన ఆయ‌న ఎంపీ మాగుంట‌కు మాత్రం క్లీన్ చిట్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఈ విష‌యం నెల్లూరు రాజ‌కీయాల్లోనే కాకుండా.. రాష్ట్ర రాజ‌కీయాల్లోనూ ఆస్తక్తి రేపుతోంది. ఇక‌, ఇటీవ‌ల ఎంపీ మాగుంట‌.. ఢిల్లీలో ఇచ్చిన పార్టీకి టీడీపీ ఎంపీల‌ను ఆహ్వానించ‌డం.. ఇప్పుడు ఏకంగా టీడీపీ కీల‌క నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి.. ఆయ‌న‌ను వెనుకేసుకురావ‌డం.. వంటి ప‌రిణామాలు.. ఆస‌క్తిగా మారాయి. మ‌రి ఇవి ఎలాంటి మ‌లుపు తిరుగుతాయో చూడాలి.