Begin typing your search above and press return to search.

బాబుకు షాక్.. కడప ఫైర్‌ బ్రాండ్ నేత వైసీపీలోకి!

By:  Tupaki Desk   |   29 July 2019 4:19 AM GMT
బాబుకు షాక్.. కడప ఫైర్‌ బ్రాండ్ నేత వైసీపీలోకి!
X
కడప జిల్లా కమలాపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి - వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని అధికారికంగా ప్రకటించారు. టీడీపీకి రాజీనామా లేఖను పంపానని.. అనుచరులతో చర్చించి జిల్లా అభివృద్ధి కోసం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన కుమారుడు అనిల్‌ కుమార్‌ రెడ్డితోపాటు కేడర్ మొత్తం పార్టీలో చేరుతున్నామని చెప్పారు.

మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు తనకు టికెట్‌ ఇవ్వకుండా మోసం చేశారని వీరశివారెడ్డి మండిపడ్డారు. బాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. అందుకే పూర్తిగా తిరస్కరించారన్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందనను గమనించకుండా.. ఓడిపోయే వారికే చంద్రబాబు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేస్తానన్నారు. సీఎం జగన్‌ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తారనే నమ్మకం ఉందన్నారు.

కాంగ్రెస్ హయాంలో కమలాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వీరశివారెడ్డి రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. కానీ చంద్రబాబు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పుత్తా నరసింహారెడ్డికే టికెట్ ఇచ్చారు. దీంతో శివారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.. ప్రచారానికి కూడా వెళ్లలేదు. అప్పట్లోనే ఆయన వైసీపీలో చేరుతారని భావించారు. వైసీపీ నేతలతో భేటీ కూడా అయ్యారు. దీంతో చంద్రబాబు పిలిచి బుజ్జగించడంతో పార్టీలో కొనసాగారు. అయితే.. ఎన్నికల తర్వాత వీరశివారెడ్డిని ఎంపీ అవినాష్‌ రెడ్డితో పాటూ ఇతర వైసీపీ నేతలు కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. అప్పుడు కూడా ఆయన చేరలేదు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.