Begin typing your search above and press return to search.
నామా మాట!...నేను అమాయకుడిని!
By: Tupaki Desk | 28 Oct 2017 5:24 PM GMTతప్పు చేసిన వాళ్లు చేసినట్టు ఒప్పుకున్న చరిత్ర ఈ దేశంలో బహుశా ఎక్కడా మనకు కనిపించదు! ఇప్పుడు ఇదే జాబితాలో చేరిపోయారు ఘనత వహించిన టీడీపీ మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త నామా నాగేశ్వరరావు! ఈయనపై హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. అదేసమయంలో ఆమె పోలీసులకు నామా వారి బాగోతం మొత్తాన్ని వీడియా - ఆడియో ఆధారాలతో సహా వివరించిన విషయమూ తాజాగా వెలుగు చూసింది. దీనిపై అతి కష్టం మీద పోలీసులు ఎఫ్ ఐఆర్ కూడా నమోదు చేశారు. వాస్తవానికి ఇదంతా జరిగి దాదాపు పదిహేను రోజులు అయింది. ఈ మహిళ చేసిన ఆరోపణల ప్రకారం సదరు మాజీ ఎంపీ గారు కర్ణాటకకు చెందిన మహిళా ఎమ్మెల్సీని సైతం లైంగికంగా వేధించారు. దీంతో ఆమె ఏకంగా కోర్టుకు ఎక్కింది.
ఇంత జరిగిన తర్వాత కూడా నామా వారు అదిరిపోయే కామెంట్ చేశారు. ఈ మొత్తం ఉదంతంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఈ విషయం ``ఇప్పుడే`` తెలిసిందని శనివారం చెప్పుకొచ్చారు. అంతేకాదు, అసలు ఈ విషయం వెనుక రాజకీయ కోణం ఉంటుందని చెప్పుకొచ్చారు. తనను, తన ప్రతిష్టను భ్రష్టు పట్టించేందుకు కొందరు ఆడుతున్న నాటకంగా ఆయన పేర్కొనడం అందరినీ నివ్వెర పరిచింది. అంతేనా.. తాను నీతిగా బతికానని, ఇప్పుడు కూడా నీతిగా ఉన్నానని, మహిళల పట్ల ఎప్పుడూ గౌరవంగానే ఉన్నానని పెద్ద ఎత్తున ప్రసంగించేశారు. మొత్తానికి నామా వారి కంక్లూజన్ ఏంటంటే.. తాను అమాయకుడు. పులుకడిగిన ముత్యం!!
నిజానికి ఏ మహిళా... ఇలా తన నగ్న చిత్రాలను బహిరంగ పరుస్తానని బెదిరించాడంటూ.. ఇంత వరకు ఏ ఎంపీపై ఫిర్యాదు చేసిన దాఖలాలు ఇటు ఏపీలోకానీ, అటు తెలంగాణలో కానీ లేవు. నిప్పులేందే పొగరాదన్నట్టు.. ఏమీ జరగనప్పుడు ఇంతలా ఆ మహిళ నేరుగా ఇన్ని సాక్ష్యాధారాలతో పోలీసులను ఆశ్రయించిన తర్వాత కూడా బొంకాలని నామా ప్రయత్నించడం అందరినీ నిశ్చేష్టులను చేస్తోంది. ఇక, కర్ణాటకకు చెందిన మహిళా ఎమ్మెల్సీ ఏకంగా కోర్టుకు ఎక్కడం పైకూడా నామా తనకు తెలియదని ఫక్తు రాజకీయం చేసేశారు. టీడీపీ సమావేశం ఉండటంతో విజయవాడ వచ్చానని, ఈ విషయం తనకు ఇప్పుడే తెలిసిందని చెప్పారు. తానెవరినీ బెదిరించలేదని, ఈ కేసు వెనుక ఉన్న రాజకీయం ఏంటో తనకు తెలియదని, న్యాయపరంగానే తాను ఎదుర్కొంటానని తెలిపారు.
వాస్తవాలన్నీ త్వరలోనే బయటకొస్తాయని, ఒకరిని బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం తనకు లేదని, నలుగురికి సాయం చేసే మనస్తత్వం తనదని అన్నారు. నిజానికి తాను అమాయకుడైతే.. అటు కర్ణాటకలో కానీ, ఇటు తెలంగాణలో కానీ ఇలా ఎందుకు ఫిర్యాదులు వెల్లు వెత్తాయో నామా వారే సెలవివ్వాలి. కానీ, తప్పుచేసిన వారు చెబుతారా? నామా మాత్రం స్పెషలని ఎందుకనుకోవాలి? ఇప్పుడు ఖచ్చితంగా ఆయన వ్యాఖ్యలు కూడా ఇలానే ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. అటు రాజకీయంగా, ఇటు పారిశ్రామికంగా కూడా మంచి పలుకుబడి ఉన్న నేత కావడంతో ఈ కేసులో నిజానిజాలు బయటకు వస్తాయనే ఆశ చాలా తక్కువే అంటున్నారు విశ్లేషకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి.. తెలంగాణ టీడీపీలో నేతలు ఇలా దిగజారుడు వ్యవహారాలకు పాల్పడుతుంటే.. మరి అధినేత చంద్రబాబు ఏం చేస్తున్నట్టనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. మరి దీనిపై బాబు స్పందిస్తారా? మనకెందుకులే అని మౌనం వహిస్తారా? చూడాలి!!