Begin typing your search above and press return to search.

'పసుపు- కుంకుమ' మీద విచారణ జరుగుతుందా?

By:  Tupaki Desk   |   23 April 2019 5:57 AM GMT
పసుపు- కుంకుమ మీద విచారణ జరుగుతుందా?
X
ఎన్నికల ముందు పసుపు-కుంకుమ డబ్బులు ఇవ్వడం తమకు చాలా మేలు చేసిందని తెలుగుదేశం వాళ్లు అంటున్నారు. ఈ విషయంలో వారు ఓపెన్ గానే స్పందిస్తున్నారు. పోలింగ్ కు వారం పది రోజుల ముందు మహిళల ఖాతాల్లోకి డబ్బులు వేయడం తెలుగుదేశం పార్టీకి మేలు చేసిందని, అలా డబ్బులు పొందిన వాళ్లంతా తమకే ఓటు వేసే అవకాశం ఉందని తెలుగుదేశం వాళ్లు చెబుతున్నారు.

సంక్షేమ పథకాలు అమలు చేయడం తమ విజయ రహస్యం అని టీడీపీ వాళ్లు అనడం లేదు. పోలింగ్ కు ముందు కొన్ని రోజుల్లో మహిళల ఖాతాల్లోకి డబ్బులు వేయడమే తమను గెలిపించేలా ఉందని వారు ఓపెన్ గా చెబుతున్నారు. 'పసుపు – కుంకుమ' డబ్బులు వేయకపోతే.. తమ పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని వారు విశ్లేషిస్తున్నారు.

ఇలా తెలుగుదేశం పార్టీ వాళ్లు.. తాము చేసిన ఓట్ల కొనుగోలు రాజకీయం గురించి ఓపెన్ గా వివరిస్తూ ఉన్నారు. ఇదే ఇప్పుడు చాలా విమర్శలకు గురి అవుతోంది. ఐదేళ్ల పాటు పాలిస్తే.. తమ పాలనలో తమను గెలిపించే అంశం ఏదీ లేదన్నట్టుగా కేవలం పసుపు- కుంకుమ రూపంలో పంచిన డబ్బే తమను గెలిపిస్తుందని టీడీపీ వాళ్లు చెబుతున్నారు.

ఆ డబ్బు అంతా టాక్స్ పేయర్స్ ది. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బు. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం తమ జేబుల్లోంచి తీసి ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ప్రభుత్వ సొమ్ముతో ఇలా ఓట్లను కొనుగోలు చేయడానికి 'పసుపు- కుంకుమ' అనే పేరును వాడుకున్నారు. జనాల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేశారు.

ఆ విషయాన్ని వారు ఓపెన్ గానే చెబుతున్నారు. రాబోయే ప్రభుత్వాలు ఇలాంటి స్కామ్ మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇలా ప్రజాధనంతో ప్రజల ఓట్లను కొనుగోలు చేసే దుష్ట రాజకీయం పట్ల కాస్త ఆలోచన జ్ఞానం ఉన్న వారు చీదరించుకుంటున్నారు.