Begin typing your search above and press return to search.

ఆ సీట్లలో తెలుగుదేశం పార్టీకి మూడో స్థానమేనా?

By:  Tupaki Desk   |   4 May 2019 4:43 AM GMT
ఆ సీట్లలో తెలుగుదేశం పార్టీకి మూడో స్థానమేనా?
X
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా త్రిముఖ పోరు జరిగింది. జనసేన పార్టీ ప్రభావం ఈ ఎన్నికల్లో పెద్దగా ఉండదని కొంతమంది బల్లగుద్ది చెబుతున్నప్పటికీ.. అక్కడక్కడ మాత్రం ఆ పార్టీ కొంత వరకూ పోటీ ఇచ్చిందని పరిశీలకు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. జనసేన ప్రభావంతో కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు తప్పలేదని విశ్లేషిస్తున్నారు.

ఎక్కడైతే జనసేన బలంగా పోటీ ఇచ్చిందో అక్కడ తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికి పరిమితం అయిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఈ మేరకు కొన్ని నియోజకవర్గాల విషయంలో స్పష్టమైన అభిప్రాయాలే వినిపిస్తూ ఉన్నాయి. వాటిల్లో తెలుగుదేశం పార్టీకి దక్కింది మూడో స్థానమే అని అంటున్నారు.

అలాంటి నియోజకవర్గాల పేర్లు కూడా విని వినిపిస్తూ ఉన్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ - విశాఖ పట్టణం నార్త్ - గాజువాక - భీమవరం - నరసాపురం - గుంటూరు పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం - పెడన - కల్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి మూడో స్థానమే దక్కిందని కొన్ని పరిశీలనలు చెబుతూ ఉన్నాయి.

గాజువాకలో పవన్ కల్యాణ్ పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి అక్కడ తెలుగుదేశం పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. అయినా తెలుగుదేశం పార్టీ అక్కడ పవన్ కల్యాణ్ కు సహకరించిందనే అభిప్రాయాలు
వినిపిస్తూ ఉన్నాయి. అయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గట్టి పోటీ ఇచ్చిందని తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాలే చెబుతూ ఉన్నాయి. దీంతో తెలుగుదేశానికి మూడో స్థానం తప్పలేదని ఒక పరిశీలన చెబుతూ ఉంది.

ఇక భీమవరంలో కూడా అదే పరిస్థితి ఉందని - పవన్ కల్యాణ్ ఇక్కడ కూడా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఇక్కడ కూడా తెలుగుదేశం సహకరించిందని అంటున్నారు. దీంతో ఆ పార్టీకి మూడో స్థానమే అని ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెగ్గే అవకాశాలున్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇక కల్యాణదుర్గంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి తెలుగుదేశం పార్టీ సహకరించిందనే మాట వినిపిస్తోంది. దీంతో అక్కడ కూడా ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితం అయ్యిందని సమాచారం. ఇక మిగతా నియోజకవర్గాల్లో జనసేన తన బలం మేరకు పోటీ ఇవ్వడంతో టీడీపీ మూడో స్థానానికి పడిపోవచ్చనే అంచనాలున్నాయి! ఏ నియోజకవర్గం కథ ఎలా ఉంటుందో మే ఇరవై మూడున అధికారికంగా తేలాల్సిందే!