Begin typing your search above and press return to search.

అన్న క్యాంటీన్ల మ‌హిమ ఏంటో ఆ నేత‌లు తెలుసుకున్నారా?

By:  Tupaki Desk   |   25 Aug 2022 1:30 AM GMT
అన్న క్యాంటీన్ల మ‌హిమ ఏంటో ఆ నేత‌లు తెలుసుకున్నారా?
X
త‌మిళనాడులో అమ్మ క్యాంటీన్ల స్ఫూర్తితో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త టీడీపీ ప్ర‌భుత్వం అన్న క్యాంటీన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉద‌యం రూ.5 కే టిఫిన్, మ‌ధ్యాహ్నం, రాత్రి రూ.5కే భోజ‌నం అందిస్తూ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు అన్ని వ‌ర్గాల ఆద‌ర‌ణ‌ను చూర‌గొన్నాయి. ముఖ్యంగా నిరుపేద‌లు, రోజువారీ కూలీలు, భ‌వ‌న నిర్మాణ రంగ కార్మికులు, రైతులు, వివిధ చేతివృత్తుల‌వారికి అన్న క్యాంటీన్ల‌తో ఎంతో మేలు జ‌రిగింది.

దీంతో గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అన్న క్యాంటీన్ల‌కు శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసింది. దీంతో అన్న క్యాంటీన్లు త‌మిళ‌నాడులోని అమ్మ క్యాంటీన్ల త‌ర‌హాలో మంచి విజయం సాధించాయి. అయితే వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎక్క‌డిక‌క్క‌డ వీటిని కూల‌గొట్టింది.

మ‌రికొన్నిచోట్ల ఇవి నిరుప‌యోగం మారాయి. అయితే టీడీపీ నేత‌లు నంద‌మూరి బాల‌కృష్ణ‌, నారా లోకేష్ త‌దిత‌రులు హిందూపురం, మంగ‌ళ‌గిరిలో అన్న క్యాంటీన్ల‌ను త‌మ సొంత ఖ‌ర్చుల‌తో నిర్వ‌హిస్తూ త‌క్కువ‌కే పేద‌ల‌కు ఆహారం అందిస్తున్నారు. మ‌రికొన్ని చోట్ల కూడా టీడీపీ నేత‌లు అన్న క్యాంటీన్ల‌కు ప్ర‌జ‌ల్లో ఉన్న ఆద‌ర‌ణ‌ను గుర్తించి సొంత ఖ‌ర్చుల‌తో వీటిని నిర్వ‌హిస్తున్నారు.

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక అన్న క్యాంటీన్ల‌ను నిరుప‌యోగంగా మార్చ‌డంతో అప్ప‌ట్లోనే నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. అన్న క్యాంటీన్ల‌ను కావాలంటే పేరు మార్చి కొన‌సాగించాల‌ని.. ఇవి అతి త‌క్కువ ఖ‌ర్చుకే పేద‌ల ఆక‌లి తీరుస్తున్నాయ‌ని విజ్ఞ‌ప్తులు వ‌చ్చాయి. అయినా వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం వీటిని కొన‌సాగించడానికి మొగ్గు చూప‌లేదు.

అయితే ఇప్పుడు ఏపీలో రాజ‌కీయాలు హీటెక్క‌డం, ఎన్నిక‌ల వేడి అప్పుడే నెల‌కొన‌డంతో టీడీపీ నేత‌లతోపాటు వైఎస్సార్సీపీ నేత‌లు కూడా అన్న క్యాంటీన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వైఎస్సార్సీపీ నేత‌లు వైఎస్సార్ పేరు, త‌మ పేరు వ‌చ్చేలా వీటిని నిర్వ‌హిస్తున్నారు. ఇవి వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఓట్లు రాల్చిపెట్ట‌డంలో స‌హాయ‌పడ‌తాయ‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే అనంత‌పురం జిల్లా గుంత‌క‌ల్లులో ఎమ్మెల్యే వై. వెంక‌ట్రామిరెడ్డి... వైఎస్సార్‌- వైవీఆర్ పేరుతో క్యాంటీన్ నిర్వ‌హిస్తున్నారు. అయితే రూ.5కు బదులుగా రూ.10కు ఆహారం అందిస్తున్నారు.

ఇక మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడే త‌క్కువ ధ‌ర‌కు భోజ‌నం అందించే ఏర్పాటు చేశారు. అలాగే చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి వంటివారు కూడా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు త‌క్కువ ధ‌ర‌కే ఆహార‌మందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌గిరి, గుంత‌క‌ల్లు, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యేల బాట‌లోనే మ‌రికొంద‌రు కూడా క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నార‌ని స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించానికి ఏ ఒక్క అవ‌కాశాన్ని వ‌దుల్చుకోవ‌డానికి సిద్ధంగా లేర‌ని అంటున్నారు.