Begin typing your search above and press return to search.

టీడీపీ మూలాలు కదులుతున్నాయా?

By:  Tupaki Desk   |   12 Dec 2016 11:39 AM GMT
టీడీపీ మూలాలు కదులుతున్నాయా?
X
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గమంటే టీడీపీకి, పరిటాల సునీతకు కంచుకోట. కానీ... అక్కడ ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ నేతలే పరిటాల వర్గంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సునీత పూర్తిగా సొంత సామాజికవర్గానికే పెద్ద పీట వేస్తూ మిగతావారిని పక్కనబెడుతున్నారని ఆరోపిస్తున్నారు.

తాజాగా ఆ నియోజకవర్గంలోని కనగానపల్లి టీడీపీ మండలాధ్యక్షుడు ఇదే కారణం చూపుతూ టీడీపీకి రాజీనామా చేశారు. బీసీ కులానికి చెందిన సురేందర్‌ను దించేసి తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ఎంపీపీగా నియమించేందుకు పరిటాల సునీత ఒత్తిడి తెస్తున్నందు వల్లే ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చారని చెబుతున్నారు. ఎంపీపీ సురేందర్, మండల ఉపాధ్యక్షుడు ఇద్దరూ వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తనను ఎంపీపీగా ఎన్నుకున్నప్పటికీ బీసీని కావడంతో టీడీపీలో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని ఎంపీపీ సురేందర్ ఆరోపిస్తున్నారు.

పరిటాల సునీత ఆధ్వర్యంలో కేవలం ఆ సామాజికవర్గం నేతలకుమాత్రమే పెద్దపీట వేస్తున్నారని, బీసీలను, ఇతర కులాలను పట్టించుకోవడం లేదని వైసీపీ రాప్తాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి మీడియా ముందే మండిపడ్డారు. మరి చంద్రబాబు పార్టీకి కంచుకోటలాంటి నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఉదాసీనంగా ఉంటే ఇలాంటి వలసలు మరిన్ని నియోజకవర్గాల్లో తప్పవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎంపీపీలు, గ్రామస్థాయి నాయకుల్లో అసంతృప్తి వస్తే టీడీపీ మూలాలకే దెబ్బని అంటున్నారు.