Begin typing your search above and press return to search.

లోకల్ వార్ లో టీడీపీ నేతల హ్యాండ్స్ అప్?

By:  Tupaki Desk   |   14 March 2020 5:30 PM GMT
లోకల్ వార్ లో టీడీపీ నేతల హ్యాండ్స్ అప్?
X
ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. తమ అభ్యర్థులను నామినేషన్ కూడా వేయనివ్వకుండా బెదిరిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు. టీడీపీ అభ్యర్థులపై దాడి చేస్తున్నారని, నామినేషన్ పేపర్లు చించి వేస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. మరోవైపు, లోకల్ వార్ లో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులే కరువయ్యారని, అందుకే వైసీపీపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలంటున్నారు. అయితే, కొందరు టీడీపీ నేతల మాటలు వింటుంటే మాత్రం స్థానిక సమరం లో టీడీపీ చేతులెత్తేసిందని స్పష్టమవుతోంది.

కర్నూలు లో డోన్ మున్సిపాలిటీని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి దానం చేశామంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యలు కలకలం రేపాయి. డోన్ మున్సిపాలిటి లో తాము పోటి చేయటం లేదని కేఈ ప్రకటించారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టిడిపి లో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. ఇక, అనంతపురం టీడీపీలో కీలక నేత, మాజీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ జేసీ దివాకర్ రెడ్డి....మున్సిపల్ ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నామని, ఎన్నికలకు తమ వర్గం దూరమని ప్రకటించారు. ఇక విశాఖపట్నం కార్పొరేషన్లో చాలా మున్సిపాలిటిలు, కార్పొరేషన్లలో నామినేషన్లకు టిడిపి నేతలే దూరంగా ఉన్నారు.

డోన్, అనంతపురం, విశాఖ, ఏకగ్రీవం అయిన కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే...ఏపీలో కొన్ని చోట్ల గొడవలు జరిగిన మాట వాస్తవమే. కానీ, బరిలో దిగలేమంటూ టీడీపీ నేతలు వెనకడుగు వేసిన మున్సిపాలిటిల తో పోలిస్తే చంద్రబాబు చెప్పిన తరహాలో గొడవలు గట్రా జరిగిన మునిసిపాలిటీలు చాలా తక్కువ. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలను విపరీతంగా ఆకర్షించాయని, కాబట్టి లోకల్ వార్ లో వార్ వన్ సైడ్ అని చాలామది టీడీపీ నేతలు ఫిక్స్ అయ్యారట. అందుకే, గట్టి పోటి ఇవ్వలేమనుకున్న చోట పోటీ చేసి చేతులు కాల్చుకోవడం ఇష్టం లేక సైలెంట్ గా ఉన్నారట. అయితే, ఈ విషయాలను మరుగున పెట్టి...చంద్రబాబు ఒకే పాట పాడడం విడ్డూరంగా ఉంది. ఆడలేక మద్దెల ఓడు అంటే ఇదేనేమో..