Begin typing your search above and press return to search.

ఆ జిల్లాలో టీడీపీ ఆశలన్నీ సూరీడుపైనేనా?

By:  Tupaki Desk   |   28 Dec 2022 12:30 AM GMT
ఆ జిల్లాలో టీడీపీ ఆశలన్నీ సూరీడుపైనేనా?
X
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని తలపోస్తున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ ఏడాది మేలో నిర్వహించిన మహానాడు అంచనాలకు మించి విజయవంతమైంది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ప్రజలపై విధించిన అధిక ధరలకు నిరసనగా నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం కూడా సక్సెస్‌ అయ్యింది. అలాగే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం కూడా విజయవంతమైంది.

ఓవైపు నియోజకవర్గాల సమీక్షలతోపాటు ఆయా జిల్లాల్లో చంద్రబాబు సుడిగాడి పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు జనవరి నెలాఖరు నుంచి నారా లోకేష్‌ భారీ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. తన తండ్రి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు పాదయాత్ర చేయనున్నారు.

ముఖ్యంగా రాయలసీమలో కీలకమైన కర్నూలు జిల్లాలో రెండు పార్లమెంటు (కర్నూలు, నంద్యాల) స్థానాలను, 14 అసెంబ్లీ స్థానాలను 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. 2014లో సైతం అత్యధిక స్థానాలను వైసీపీ కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు.

ఇటీవల కర్నూలు జిల్లాలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి భారీగా ప్రజలు హాజరయ్యారు. అంచనాలకు మించి జనం హాజరుకావడం టీడీపీ శిబిరంలో జోష్‌ నెలకొంది.
వాస్తవానికి కర్నూలు జిల్లాలో టీడీపీకి గట్టి అభ్యర్థులే ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఆయన సోదరుడు కేఈ ప్రభాకర్, ఎన్‌ఎండీ ఫరూఖ్, భూమా అఖిలప్రియ, గౌరు చరిత వంటి నేతలు ఉన్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కొల్లగొట్టాలని చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలో భారమంతా మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి పైనే వేసినట్టు తెలుస్తోంది. కోట్ల కుటుంబానికి ఉన్న భారీ అంగ, అర్థ బలాలు, క్లీన్‌ ఇమేజ్‌ టీడీపీ గెలుపుకు ఉపయోగపడతాయని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చిన కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి సైతం చంద్రబాబు తనపైన పెట్టిన బాధ్యతకు తగ్గట్టే వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

ఇటీవల కర్నూలు జిల్లాలో వేదవతి ప్రాజక్టు నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతూ కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి పాదయాత్ర చేశారు. ఆలూరు నియోజకవర్గంలోని హాలహర్వి నుంచి గూల్యం వరకూ దాదాపు 12 కిలోమీటర్ల నిర్వహించిన పాదయాత్ర విజయవంతమైంది.

కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, ఆయన సతీమణి సుజాతమ్మ నిర్వహించిన పాదయాత్రలో టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, అమర్‌నాథ్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జ్‌లు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, వేలాది మంది రైతులు పాల్గొన్నారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇదే ఊపులో వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లను కొల్లగొట్టాలనే లక్ష్యంతో సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.