Begin typing your search above and press return to search.

పెగాసస్ పై డిఫెన్స్ లో టీడీపీ

By:  Tupaki Desk   |   19 March 2022 8:30 AM GMT
పెగాసస్ పై డిఫెన్స్ లో టీడీపీ
X
వివాదాస్పద స్పైవేర్ పెగాస్ సాఫ్ట్ వేర్ వాడకంపై తెలుగుదేశం పార్టీ డిఫెన్స్ లో పడిపోయింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కదిల్చిన పెగాసస్ తుట్టె ఇపుడు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనమని తను ఇజ్రాయెల్ వాళ్ళు సంప్రదిస్తే తాను నిరాకరించినట్లు మమత చెప్పారు. అయితే ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసినట్లు మమత చెప్పటంతో వివాదం మొదలైంది. తాము ఎలాంటి సాఫ్ట్ వేర్ కొనలేదని నారా లోకేష్ చెప్పారు. అయితే మమత దీన్ని అంగీకరించటం లేదు.

చంద్రబాబు స్పైవేర్ ను కచ్చితంగా కొన్నారని శుక్రవారం కూడా బల్లగుద్ది చెప్పారు. మరి ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయో తెలీదు. ఈ విషయం ఇలాగుంటే తాము సాఫ్ట్ వేర్ ను కొనలేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారంటు టీడీపీ వాళ్ళు ఒక నోట్ విడుదల చేశారు. అయితే అదంతా కన్విన్సింగ్ గా లేదు. ఎందుకంటే స్పైవేర్ కొనుగోలు చేసిందనే ఆరోపణలు చంద్రబాబు హయాంలో. అప్పుడు గౌతమ్ సవాంగ్ డీజీపీ కాదు. పైగా అప్పట్లో గౌతమ్ డీజీపీ కూడా కాదు.

అప్పుడెప్పుడో సాఫ్ట్ వేర్ కొన్నారా లేదా అని తర్వాతెప్పుడో డీజీపీ అయిన గౌతమ్ చెప్పలేరు. ఇదే సమయంలో డీజీపీ కార్యాలయం వేరు ఇంటెలిజెన్స్ ఆఫీసు వేరు. స్పైవేర్ కొనుగోలు చేశారని, ప్రత్యర్ధులపైన ప్రయోగించారని ఆరోపణలున్నది చంద్రబాబు హయాంలో చక్రంతిప్పింది ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు.

పైగా ఏబీపై ఇజ్రాయెల్ నుండి అత్యాధునిక టెలికాం పరికరాలు తెప్పించారనే విషయం ఇప్పటికే నిరూపణైంది. అందుకనే తాజాగా ఏబీపై ఛార్జిషీటు వేయమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి టీడీపీ వాళ్ళు చూపుతున్న ఆర్టీఐ నోట్ లో అంత పస లేదు.

అప్పట్లో తన కొడుకు సంస్ధ ద్వారా ఇజ్రాయెల్ నుండి ఆధునిక పరికరాలు కొన్నట్లు ఏబీ కూడా విచారణలో అంగీకరించారు. అప్పుడు కొన్న పరికరాలే పెగాసస్ సాఫ్ట్ వేర్ అయ్యుందచ్చనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఎందుకంటే అప్పట్లో ప్రభుత్వం చెల్లించింది కూడా రు. 25 కోట్లే. సాఫ్ట్ వేర్ ఖరీదు కూడా రు. 25 కోట్లే కావటంతో అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. పైగా అన్నింటికీ మించి చంద్రబాబుకు మద్దతుగా నిలబడే మీడియా అసలు ఈ విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా విషయాన్ని డౌన్ ప్లే చేస్తోంది. ఇలాంటివి చూసిన తర్వాత టీడీపీ బాగా డిఫెన్స్ లో పడిపోయిందనే అనిపిస్తోంది.