Begin typing your search above and press return to search.

ప‌శ్చిమ గోదావ‌రిలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   26 July 2021 11:30 PM GMT
ప‌శ్చిమ గోదావ‌రిలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిన‌ట్టేనా?
X
అస‌లే తీవ్ర సంక‌టంలో ఉన్న ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం .. టీడీపీకి గోరుచుట్టుపై రోక‌లిపోటులా ప‌రిస్థితులు మారుతున్నాయి. పార్టీని గాడిలో పెట్టేందుకు పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. అవి ఎక్క‌డా ఫ‌లించ‌క పోగా.. రాను రాను.. ఇబ్బందులు పెరుగుతున్నాయి.తాజాగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కేంద్రం ఏలూరు మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. ఈ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ వైసీపీ దూకుడు భారీ రేంజ్‌లో కొన‌సాగింది. ఇక్క‌డి మొత్తం 50 వార్డుల్లో వైసీపీ 47 త‌న ఖాతాలో వేసుకోగా.. టీడీపీ కేవ‌లం 3వార్డులకే ప‌రిమిత‌మైంది.

ఈ ప‌రిణామం.. టీడీపీ ఆవిర్భ‌వించిన త‌ర్వాత‌.. ఎదురైన తొలి ప‌రాభ‌వంగా ప‌రిశీలకులు చెబుతున్నారు. నిజానికి ఏలూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పార్టీ సీనియ‌ర్ లు, యోధానుయోధులు.. ఇక్క‌డ పాగా వేసి.. మ‌రీ ప్ర‌చారం చేశారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ కార్పొరేష‌న్‌ను టీడీపీ వ‌శం చేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, అనుకున్న‌ది ఒక్క‌టి.. అయింది మ‌రొక్క‌టి.. అన్న‌త‌ర‌హాలో ప‌రిస్థితి మారిపోయింది. దీంతో కొన్ని ద‌శాబ్దాల పాటు ఈ న‌గ‌రంలో తిరుగులేని ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన టీడీపీకి ఇప్పుడు పెద్ద ఎదురు దెబ్బ‌త‌గిలింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇక‌, స్థానికంగా ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. టీడీపీ కీల‌క నాయ‌కుడు.. బోడే ప్ర‌సాద్ మృతి చెందారు. ఆ త‌ర్వాత‌.. ఎంపీ అభ్య‌ర్థి(ఏలూరు) మాగంటి బాబు కుటుంబంలో కుమారులు మృతి చెంద‌డం.. వంటి ప‌రిణామాల‌తో ఇక్క‌డ టీడీపీని న‌డిపించే నాయ‌కులు క‌రువ‌య్యారు. దీంతో మెజారిటీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు.. వైసీపీకి జైకొట్టారు. అదేస‌మ‌యంలో కొంద‌రు బీజేపీ బాట ప‌ట్టారు. ఇక‌, టీడీపీలో నేత‌లు ఉన్న‌ప్ప‌టికీ.. స్త‌బ్దుగా ఉండ‌డం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యానికి కార‌ణంగా మారింది.

నిజానికి ప‌శ్చిమ ను తీసుకుంటే.. ఇద్ద‌రు మాజీ మంత్రులు ఇక్క‌డ టీడీపీకి ఉన్నారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే క‌మ్ మంత్రి కేఎస్ జ‌వ‌హ‌ర్‌, ఆచంట మాజీ ఎమ్మెల్యే క‌మ్ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ‌లు ఉన్న‌ప్ప‌టికీ.. ఎన్నిక‌ల్లో దూకుడు చూపించ‌లేక పోయారు. పార్టీ స‌మావేశాల్లోనూ వారు స్త‌బ్దుగా ఉన్నారు. అంతేకాదు.. జ‌గ‌న్ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా పార్టీ నిర్వ‌హించిన‌.. పిలుపునిచ్చిన ఆందోళ‌న‌ల‌కు కూడా వారు దూరంగా ఉన్నారు. ఎక్క‌డా వారు క‌నిపించ‌లేదు. ఇక‌, మాజీ మంత్రి, ఎస్సీ వ‌ర్గానికి చెందిన మ‌హిళా నాయ‌కురాలు పీతల సుజాత కూడా ఇదే విధంగా వ్య‌వ‌హ‌రించారు.

అదేస‌మ‌యంలో మాజీ ఎంపీ మాగంటి బాబు అనారోగ్య కారణాలు..కుటుంబ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న కూడా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్నారు. ఇక‌, మాజీ ఎంపీ.. తోల సీతా మ‌హాలక్ష్మి కూడా ఇలానే వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, పార్టీకి ఇప్పుడు ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఉన్నారు. గ‌త 2019లో వైసీపీ సునామీని త‌ట్టుకుని మ‌రీ విజ‌యం ద‌క్కించుకున్న ఉండి ఎమ్మెల్యే మంతెన రామ‌రాజు, పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు కీల‌కంగా ఉన్నారు. అయితే.. వీరిలో మంతెన మాత్రం కేవ‌లం ఉండికే ప‌రిమిత‌మ‌య్యారు.

పార్టీ కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న పెద్ద‌గా చురుగ్గా పాల్గొన‌డం లేదు. అంతేకాదు.. చాలా రోజులు ఆయ‌న అస‌లు నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా ప‌ట్టించుకోలేదు. దీంతో చాలా మంది కార్య‌క‌ర్త‌లు, దిగువ శ్రేణి నాయ‌కులు పార్టీకి దూరంగా ఉన్నారు. అయితే.. ఒక్క నిమ్మ‌ల రామానాయుడు మాత్రం ఒకింత యాక్టివ్‌గా ఉన్నారు. పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డంలో కానీ.. వైసీపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ‌డంలో కానీ.. వివిధ రూపాల్లోఆందోళ‌న చేయ‌డంలోకానీ.. నిమ్మ‌ల ముందున్నారు. అయితే.. ఆయ‌న ఇంత చేసినా.. రాష్ట్ర నేత‌గా ఎదిగే క్ర‌మంలో చేశార‌నే ముద్ర వేసుకోవ‌డం గ‌మ‌నార్హం.