Begin typing your search above and press return to search.

జంపింగ్ లూ... ఈ అన్యాయంపై ఏమంటారండీ?

By:  Tupaki Desk   |   5 July 2019 4:06 PM GMT
జంపింగ్ లూ... ఈ అన్యాయంపై ఏమంటారండీ?
X
రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి గానీ - ఆయ‌న నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కు గానీ ఎంత‌మాత్రం క‌నిక‌రం లేద‌నే చెప్పాలి. గ‌డ‌చిన‌ప ఐదేళ్ల‌లో ఏపీకి తీర‌ని అన్యాయం చేసిన మోదీ స‌ర్కారు... తాజా ఐదేళ్ల‌లోనూ అదే త‌ర‌హా వైఖ‌రిని కొన‌సాగించ‌నున్న‌ట్లుగా స్ప‌ష్ట‌మైన సంకేతాల‌ను ఇచ్చేసింది. ఇందుకు నిద‌ర్శ‌న‌మే... నేడు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ అని చెప్ప‌క తప్ప‌దు. చంద్ర‌బాబు హ‌యాంలో క‌నీసం వందో - 5 వంద‌ల కోట్లో విదిలించిన మోదీ స‌ర్కారు జ‌గ‌న్ హ‌యాం వ‌చ్చేస‌రికి విదిలింపుల‌ను లేశ‌మాత్రానికి త‌గ్గించేసింది. ఇలాంటి త‌రుణంలో ఏపీకి న్యాయం చేయ‌డం కోసం, ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం బీజేపీలో చేరిపోతున్నామంటూ మొన్న‌టికి మొన్న కాషాయం గూటికి చేరిన న‌లుగురు టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుల మాట‌లు ఇప్పుడు అంద‌రికీ గుర్తుకు వ‌స్తున్నాయి.

టీడీపీలోనే రాజ‌కీయ ఓన‌మాలు దిద్దుకున్న రాజ్య‌స‌భ స‌భ్యులు సుజ‌నా చౌద‌రి - సీఎం ర‌మేశ్ - గ‌రిక‌పాటి మోహ‌న్ రావుల‌తో పాటు జంపింగ్ ల‌పై త‌న‌కు మాత్ర‌మే పేటెంట్ ఉన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన టీజీ వెంక‌టేశ్ మూకుమ్మ‌డిగా బీజేపీలో చేరిపోయారు. చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న స‌మ‌యంలో త‌మ‌దైన శైలి వ్యూహం అమ‌లు చేసిన ఈ న‌లుగురు కేవ‌లం ఒక్క‌టంటే ఒక్క రోజులోనే బీజేపీలోకి చేరిపోయారు. ఈ సంద‌ర్భంగా వీరు ఏపీ ప్ర‌యోజ‌నాల‌పై చాలానే మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేర‌డానికి గ‌ల కార‌ణాల‌ను వివ‌రిస్తూ... అధికారంలో ఉన్న పార్టీలో చేరి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌తామ‌ని - కేవ‌లం అందుకోస‌మే తాము పార్టీ మారిన‌ట్టుగా చెప్పుకొచ్చారు. అస‌లు వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల మాటే లేద‌ని - కేవలం రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే త‌మ‌కు ముఖ్య‌మని వారు చెప్పుకొచ్చారు.

స‌రే... రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మైతే పార్టీ మారినా ఎలాగోలా స‌ర్దుకోవ‌చ్చు అనుకుంటే... ఇప్పుడు కేంద్ర బ‌డ్జెట్ లో ఏపీకి నిధుల కేటాయింపు మాట కాదు కదా... అస‌లు ఏపీ ప్ర‌స్తావ‌న లేకుండానే బ‌డ్జెట్ సాగిపోయింది. మ‌రి బీజేపీలో చేరిన ఈ న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు ఏం ఒర‌గ‌బెట్టిన‌ట్టు? అస‌లు ఈ బ‌డ్జెట్ లో ఏపీకి జ‌రిగిన అన్యాయంపై వీరు ఏం స‌మాధానం చెబుతారు? అస‌లు వీరు ఇప్పుడు నోరు విప్పేందుకు సాహ‌సిస్తారా? ఏపీకి లేశ‌మాత్రం లాభం చేయ‌లేక‌పోయిన ఈ న‌లుగురు ఎంపీలు... రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ని తీపి క‌బుర్లు చెప్పారు క‌దా. మ‌రి ఇప్పుడు ఏపీకి జ‌రిగిన అన్యాయంపై ఇప్పుడు ఈ న‌లుగురిని నిల‌దీస్తే... ఏం స‌మాధానం చెబుతారో చూడాలి. అంతేకాదండోయ్‌... ఏపీ ప్ర‌జ‌లు ఈ న‌లుగురిని నిల‌దీసి మ‌రీ నిగ్గ‌దీయాల్సిన అవ‌స‌రం కూడా ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది.