Begin typing your search above and press return to search.

అనుమానాల కాపురంలో కాపు మంత్రులు

By:  Tupaki Desk   |   5 March 2016 7:00 AM GMT
అనుమానాల కాపురంలో కాపు మంత్రులు
X
ఏపీలో కాపు మంత్రులు మహా ఇరకాటంలో పడ్డారు. తమ ప్రభుత్వంపై, తమ ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు సంధిస్తున్న కాపునాడు నేత ముద్రగడ పద్మనాభంపై ఆ సామాజికవర్గానికి చెందిన మంత్రులు ఎదురుదాడి చేయకపోవడం పార్టీ అధినేత - సీఎం చంద్రబాబునాయుడుకు ఆగ్రహం తెప్పిస్తోంది. కాపు మంత్రులు ముద్రగడపై మొహమా టంతో ఉన్నారని ఆయన అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయంలో కాపు మంత్రులు అటు బాబు, ఇటు స్థానిక కాపు క్యాడర్ మధ్య నలిగిపోతున్నారు. కాపు రిజర్వేషన్ల వ్యవహారంలో దూకుడుగా వెళుతూ, ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్న ముద్రగడ వ్యవహారశైలి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. కాపుగర్జనలో జరిగిన విధ్వంసం, తర్వాత జరి గిన ఆమరణ నిరాహారదీక్ష పరిణామాలు సంస్థాగతంగా టిడిపిని కూడా ఇరుకున పెట్టాయి.

ఈ తరుణంలో చంద్రబాబు కేబినెట్ లోని కాపు మంత్రుల పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా మారింది. టీడీపీ - చంద్రబాబులను విమర్శిస్తున్న ముద్రగడపై ఎదురుదాడి చేయలేక... అలా అని చంద్రబాబును తిడుతుంటే ఊరుకోలేక గిలగిలలాడుతున్నారు. ముద్రగడపై ఎదురుదాడి చేస్తే కాపు వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది తమ రాజకీయ జీవితంపై ప్రభావం చూపిస్తుంది. సామాజిక వర్గ ఓట్లను పోగొట్టుకుంటే ఎన్నికల్లో గెలవడం కష్టమన్న సంగతి తెలియందేమీ కాదు. అదేసమయంలో చంద్రబాబుకు మద్దతుగా నిలవకపోతే ఆయన వద్ద ఉన్న గుర్తింపు, నమ్మకం కోల్పోవాల్సి ఉంటుంది. చంద్రబాబు కూడా కాపు నేతలు ఈ రకమైన సంశయంతోనే ముద్రగడపై సీరియస్ గా లేరని భావిస్తున్నారు. దాంతో ఆయన పదేపదే కాపు మంత్రులపై ఒత్తిడి పెంచుతున్నారు.

తాజాగా క్యాబినెట్ సమావేశం లోనూ ముద్రగడపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని, బలిజ సామాజికవర్గానికి చెందిన సి. రామచంద్రయ్య తనను వ్యక్తిగతంగా దూషించినప్పటికీ ఆ జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ఎదురుదాడి చేయకుండా మౌనంగా ఉండటంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు - నారాయణ - నిమ్మకాయల చినరాజప్ప - మృణాళిని తమ సామాజికవర్గానికి చెందిన ముద్రగడపై సానుభూతి కోణంలో ఉన్నారని బాబు అనుమానిస్తున్నారు. కాగా, కాపు ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - సీనియర్ల పేరుతో పార్టీ కార్యాలయం నుంచి నిరంతరం ముద్రగడకు వ్యతిరేక ప్రకటనలు వెలువడుతున్నాయి. తమ జాతి ప్రయోజనాల కోసం నిస్వార్ధంగా పోరాడుతున్న ముద్రగడను - సొంత కాపు కుల నేతలే విమర్శించడాన్ని కాపు జనం సహించలేకపోతున్నారు. ఈ క్రమంలో తామెలా ముద్రగడపై ఎదురుదాడి చేయాలని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో తమను ముఖ్యమంత్రి అనవసరంగా అపార్ధం చేసుకుంటున్నారని, తామేదో ముద్రగడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా, తాము చూసీచూడనట్లు పోతున్నామని బాబు భావించడం సరైంది కాదని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. అప్పటికీ తాము ముద్రగడ విధానాలను తప్పుపడుతున్నామని, కానీ బాబు ఆదేశాల ప్రకారం ముద్రగడపై వ్యక్తిగత విమర్శలు చేసే పరిస్థితి లేదని అంటున్నారు.